T20 WORLD CUP: టార్గెట్ టీ ట్వంటీ వరల్డ్ కప్.. రోహిత్, కోహ్లీ రీ ఎంట్రీ వెనుక మాస్టర్ ప్లాన్

కొన్నాళ్లుగా టీ ట్వంటీలకు దూరంగా ఉంటున్న హిట్‌మ్యాన్‌, రన్‌మెషిన్‌లు రీ ఎంట్రీ ఇచ్చారు. అప్ఘానిస్తాన్‌ లాంటి చిన్నటీమ్‌తో పోరుకు వీరిద్దరి ఎంపిక వెనక పెద్ద కారణమే ఉంది. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2024 | 01:31 PMLast Updated on: Jan 09, 2024 | 1:31 PM

Rohit And Kohli Entry T20 World Cup Preparations For Team India

T20 WORLD CUP: టీమిండియా వరల్డ్ కప్ గెలిచి పుష్కర కాలం దాటిపోయింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరినా టైటిల్ కల నెరవేరలేదు. ఇప్పుడు కొత్త ఏడాదిలో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా బీసీసీఐ సెలెక్టర్లు టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు. దీని కోసం జట్టులో కొత్త హుషారు నింపారు. కొన్నాళ్లుగా టీ ట్వంటీలకు దూరంగా ఉంటున్న హిట్‌మ్యాన్‌, రన్‌మెషిన్‌లు రీ ఎంట్రీ ఇచ్చారు. అప్ఘానిస్తాన్‌ లాంటి చిన్నటీమ్‌తో పోరుకు వీరిద్దరి ఎంపిక వెనక పెద్ద కారణమే ఉంది.

VIRAT KOHLI: రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ

త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పొచ్చు. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడబోయే ఏకైక టీ 20 సిరీస్‌ ఇదే. గాయం కారణంగా సూర్యకుమార్‌, హార్దిక్‌పాండ్య, రుతురాజ్‌ గైక్వాడ్‌ దూరమయ్యారు. దీంతో సీనియర్ల రీఎంట్రీకి ఛాన్స్ దక్కింది. కోహ్లి, రోహిత్‌శర్మ భారత్‌ తరపున టీ ట్వంటీలు ఆడి ఏడాదైంది. మొన్నటి వరకూ వీరిద్దరికీ ఛాన్స్‌ లేనట్లే అని అంతా భావించారు. ప్రపంచకప్‌కు పూర్తిగా యువ జట్టునే ఎంపిక చేస్తారనుకున్నారు. అయితే కుర్రాళ్లు పూర్తిస్థాయిలో కుదురుకోకపోవడం బీసీసీఐని కలవరపరుస్తోంది. వరుసగా గాయాలు, మానసిక సమస్యలు జట్టుకు ఇబ్బందికరంగా మారాయి. హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌లు జట్టును నడిపించినా.. అనుభవలేమి వారిని దెబ్బతీస్తోంది. ఒత్తిడిలో జట్టును ముందుకు నడపడం కత్తిమీద సాములా మారింది.

దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్‌కు సీనియర్ల అవసరాన్ని బీసీసీఐ గుర్తించింది. అందుకే రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీని జట్టులో చేర్చింది. నిజానికి జట్టులో సీనియర్లు ఉండాల్సిందే. క్లిష్టమైన సమయంలో ఎలా ఆడాలో, జట్టును ఎలా నడిపించాలో, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెప్పేందుకు సీనియర్ ప్లేయర్స్ సూచనలు ఖచ్చితంగా ఉపయోగ పడతాయి. భారత్‌కు ఐసీసీ ట్రోఫీల కరవు తీర్చేందుకు రోహిత్‌, కోహ్లి అనుభవం జట్టుకు కలిసి వస్తుందని మాజీ క్రికెటర్లు సైతం చెబుతున్నారు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన జట్టు మెగా టోర్నీలో బరిలోకి దిగితే ఈ సారి టైటిల్ ఖాయం అని ఫాన్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మొత్తం మీద మిషన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ మెగా ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉందని చెబుతున్నారు.