IND Vs PAK: ఆహా.. ఓహో అన్నారు.. ఊరించి ఉసూరుమనిపించారు.. మరీ ఇంత చీప్‌గానా..!
షాహీన్ ఆఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఫామ్‌లో ఉంటే ఎంతటి ఆటగాడైనా తలవంచాల్సిందేనని ప్రూవ్ అయ్యింది. ప్రతిసారి పిచ్‌లు, కండీషన్స్ మనకు సపోర్ట్ చేయవు. అందులోనూ మ్యాచ్ జరిగింది ఇండియా గడ్డపై కూడా కాదు. శ్రీలంకలోని పల్లెకెలేలో.
IND Vs PAK: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ టీమిండియా బ్యాటింగ్ డొల్లతనాన్ని బయట పెట్టింది. ముఖ్యంగా టాప్-4 ప్లేయర్ల ఆట మరింత తీసికట్టుగా అనిపించింది. రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్ దారుణంగా బ్యాటింగ్ చేశారు.
పాక్‌పై విరాట్ కోహ్లీ రికార్డులకు తిరుగులేదు. ఇది ఎవరు ఔనన్నా.. కాదన్నా.. అంగీకరించాల్సిన విషయం. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ప్రపంచంలోనే ఏ జట్టుపైనైనా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి. అటు రోహిత్ కూడా పాక్‌ని 2019 ప్రపంచకప్‌లో ముప్పుతిప్పలు పెట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆసియా కప్‌లోనూ ఈ ఇద్దరిలో ఒకరు పాక్‌కి చుక్కలు చూపిస్తారని అంతా భావించారు. కానీ మ్యాచ్ మొదలైన కాసేపటికే ఇద్దరూ తుస్సుమనిపించారు. రెండు బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ 15 పరుగులకు పెవిలియన్‌కు చేరగా.. కోహ్లీ ఇలా వచ్చి అలా ఒక బౌండరీ బాది వెళ్లిపోయాడు.
షాహీన్ ఆఫ్రిది బంతితో నిప్పులు చెరగగా, ఇద్దరూ క్లీన్ బౌల్డ్ అయ్యారు. పిచ్ కూడా బౌలింగ్‌కి కాస్త అనుకూలించడంతో రోహిత్, కోహ్లీ ఇద్దరు త్వరగానే పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. షాహీన్ ఆఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఫామ్‌లో ఉంటే ఎంతటి ఆటగాడైనా తలవంచాల్సిందేనని ప్రూవ్ అయ్యింది. ప్రతిసారి పిచ్‌లు, కండీషన్స్ మనకు సపోర్ట్ చేయవు. అందులోనూ మ్యాచ్ జరిగింది ఇండియా గడ్డపై కూడా కాదు. శ్రీలంకలోని పల్లెకెలేలో. ఒకవేళ ఇండియా పిచ్ అయితే బ్యాటింగ్‌కి స్వర్గధామంగా తయారు చేసుకునే వాళ్లు. ప్రత్యర్థి బలాన్ని చూపించకుండా ఉండేలా జాగ్రత్త పడేవారు. అప్పుడు పరుగులు పిండికోవచ్చు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయవచ్చు. హార్దిక్, ఇషాన్ ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోయి ఉంటే రోహిత్, కోహ్లీని నెటిజన్లు ఓ ఆట ఆడుకునే వాళ్లు.
మరోవైపు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన శ్రేయర్ అయ్యర్ ఆవేశపడి అవుట్ అయ్యాడు. వచ్చిరాగానే రెండు బౌండరీలు కొట్టిన అయ్యర్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అప్పటికీ కోహ్లీ, రోహిత్ వికెట్లను కోల్పోయి ఉన్న సమయంలో భారత జట్టును ఆదుకోవాల్సింది పోయి.. టీమిండియా కష్టాలను మరింత పెంచి పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. నంబర్-4 పొజిషన్ అంటేనే పరిస్థితికి తగ్గట్టుగా ఆడాల్సిన బ్యాటింగ్ రోల్. ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయినట్టుగా కనిపించిన అయ్యర్.. ఏదో తన పవర్ చూపించాలన్న మైండ్‌సెట్‌తో కనిపించాడు. వరల్డ్‌కప్ దగ్గరపడుతుండగా ఈ నంబర్-4 పొజిషన్ లోటును తీర్చాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన అయ్యర్ ఆ పని చేయకపోగా.. నిర్లక్ష్యానికి పోయి అవుట్ అయ్యాడు. అటు గిల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆడుతున్నది వన్డే మ్యాచ్ అనే మరిచిపోయాడు. మొత్తానికి ఈ నలుగురి ఆటలోని లోపాలను పాక్ బౌలర్లు క్రికెట్ ప్రపంచానికి చూపించారు. ఇది ఒక విధంగా మంచి విషయమే. వరల్డ్ కప్‌కి ముందు తప్పులను సరిదిద్దుకునే అవకాశం అన్నమాట..!