కివీస్ తో మ్యాచ్ కు రోహిత్ ఔట్ ,భారత సారథిగా గిల్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్ కు రెడీ అయింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ మ్యాచ్ గ్రూప్ ఏ టాపర్ ను తేల్చనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2025 | 03:20 PMLast Updated on: Mar 01, 2025 | 3:20 PM

Rohit Is Out For The Match With Kiwis Gill Is The Captain Of India

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్ కు రెడీ అయింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ మ్యాచ్ గ్రూప్ ఏ టాపర్ ను తేల్చనుంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్న భారత్ తుది జట్టు పలు మార్పులు జరగనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరమవడం ఖాయమైంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ పిక్కల నొప్పతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే కాసేపు విశ్రాంతి తీసుకుని ఆడాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ అతడు బ్యాటింగ్‌ చేయలేకపోయాడు.

న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ కు ముందు టీమిండియా ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. కానీ ఈ నెట్ ప్రాక్టీస్ సెషన్ లో నొప్పి కారణంగా రోహిత్ పాల్గొనలేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో మాట్లాడి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ కూడా అందుబాటులో ఉండకూడదని రోహిత్ నిర్ణయించుకున్నాడట. ఎందుకుంటే మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడనుంది. ఒకవేళ నొప్పితోనే రోహిత్.. న్యూజిలాండ్ మ్యాచ్ లో పాల్గొంటే సెమీస్ మ్యాచ్ కు మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా సెమీస్ కోసం.. రోహిత్ కివీస్ తో మ్యాచ్ కు దూరం కానున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కివీస్ మ్యాచ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ తాత్కాలిక సారథ్య బాధ్యతలు చెపట్టే అవకాశం ఉందని తెలిసింది.

ఒకవేళ కివీస్ తో మ్యాచ్ కు రోహిత్ దూరమైతే.. గిల్ కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇదే సమయంలో పంత్ కు కూడా తుది జట్టులో చోటు దక్కనుంది. కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా కొనసాగుతుండడంతో ఇంగ్లాండ్ తో సిరీస్ నుంచి పంత్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు. ఇదిలా ఉంటే బౌలింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే ఛాన్సుంది. పాక్ తో మ్యాచ్ లో కాస్త ఇబ్బందిపడిన మహ్మద్ షమీకి రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు. షమీ స్థానంలో అర్షదీప్ సింగ్ ఆడించొచ్చు. స్పిన్ విభాగంలో మాత్రం కాంబినేషన్ ను మార్చే అవకాశం లేదని సమాచారం. కాగా బంగ్లాదేశ్ , పాక్ జట్లపై విజయాలతో ఇప్పటికే భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా…గ్రూప్‌- ఏ నుంచి న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టింది.