చేయాల్సిందంతా ఎప్పుడో చేశా ముంబై జట్టుపై రోహిత్ సెటైర్లు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లలో కేవలం 21 పరుగులే చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లలో కేవలం 21 పరుగులే చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది పరుగులకే ఔటయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 13 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇవ్వొచ్చంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. అయితే గత సీజన్ నుంచి తన ముంబై జట్టుపై హిట్ మ్యాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవేమీ నిజం కాదని ఫ్రాంచైజీ వర్గాలు చెబుతుండగా.. వేలానికి ముందు రోహిత్ ను రిటైన్ కూడా చేసుకున్నారు. కానీ పలు సందర్భాల్లో రోహిత్ చేస్తున్న కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా లక్నోతో మ్యాచ్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మ గ్రౌండ్ లో జహీర్ ఖాన్ తో మాట్లాడిన మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
రోహిత్ శర్మ, లక్నో మెంటర్ జహీర్ ఖాన్ మాట్లాడుకున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ తో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఆ వీడియోలో రిషబ్ పంత్ రోహిత్ శర్మను వెనుక నుంచి హగ్ చేసుకోవడం.. వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను చూపించే విధంగా ఉన్నప్పటికీ.. పంత్ వచ్చే ముందు రోహిత్ శర్మ జహీర్ ఖాన్ తో సీరియస్‌గా మాట్లాడడం కనిపించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జహీర్ ఖాన్ తో మాట్లాడుతూ.. “చేయాల్సినప్పుడు అన్నీ చేశాను.. ఇప్పుడు నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు” అంటూ రోహిత్ చెప్పడం వినిపించింది.రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు ముంబై ఇండియన్స్ గురించే అని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. గత సీజన్‌లో ఐపీఎల్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మను తప్పించి ఆయన స్థానంలో హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా ముంబై యాజమాన్యం నియమించింది. ఆ సమయంలో రోహిత్ శర్మ చాలా హర్ట్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. రోహిత్ శర్మ ముంబై టీమ్ నుంచి బయటకు కూడా వచ్చేస్తాడంటూ పుకార్లు కూడా వచ్చాయి.
కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ శర్మ ఆగ్రహంతో ఉన్నట్లు అతని మాటలను బట్టి అర్థం అవుతోంది. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ముంబై టీమ్ కోసం ఏం చేయాలో అది సరిగ్గా చేశానని.. ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదని హిట్ మ్యాన్ ఆ వీడియోలో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి ఇక తనకు సంబంధం లేదని.. బ్యాటింగ్ ఒక్కటే తన పని అనేలా హిట్ మ్యాన్ మాటలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన ఘనత రోహిత్ దే. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్‌లో రోహిత్ శర్మ బ్యాటర్ గానూ అద్భుతమైన రికార్డుంది. ఇప్పటి వరకు 260 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలతో 6649 పరుగులు చేశాడు. మరి ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లోనైనా హిట్ మ్యాన్ విధ్వంసం కనిపిస్తోందేమో చూడాలి.