Rohit Sharma: గెలుపు సంబరాల్లో పాస్ పోర్ట్ మాయం..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ‘మర్చిపోయే’ అలవాటు గురించి తెలిసిందే. రోహిత్ తన విలువైన వస్తువుల్ని తరచుగా మర్చిపోతుంటాడని గతంలో కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రోహిత్‌లా వస్తువులను మర్చిపోయే వాళ్లను తాను చూడలేదని విరాట్ తెలిపాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 05:54 PMLast Updated on: Sep 18, 2023 | 5:54 PM

Rohit Sharma Forgets Passport In Colombo Hotel Delays Teams Departure

Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే సమయం మిగిలి ఉన్న వేళ భారత్ ప్రపంచానికి భారీ హెచ్చరిక ఇచ్చింది. కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంతో పాటు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కనబర్చిన ఈ ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ భారీ విక్టరీతో స్వదేశానికి పయనమయ్యే ముందు, భారత్ జట్టు మరో గుర్తుండిపోయే సందర్భాన్ని పేస్ చేసింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ‘మర్చిపోయే’ అలవాటు గురించి తెలిసిందే. రోహిత్ తన విలువైన వస్తువుల్ని తరచుగా మర్చిపోతుంటాడని గతంలో కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రోహిత్‌లా వస్తువులను మర్చిపోయే వాళ్లను తాను చూడలేదని విరాట్ తెలిపాడు. ఐప్యాడ్, ఫోన్, పర్సు.. ఇలా ప్రతీది రోహిత్ మర్చిపోతుంటాడని విరాట్ చెప్పాడు. కోహ్లీ మాటలను నిజం చేస్తూ.. తాజాగా రోహిత్ ఏకంగా తన పాస్‌పోర్టునే మర్చిపోయాడు. పాస్‌పోర్టును హోటల్లోనే వదిలేసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కిన కెప్టెన్‌కు తర్వాత ఈ విషయం అర్థమైంది. దీంతో హోటల్ స్టాఫ్‌ను పిలిచి పాస్‌పోర్ట్ తెచ్చి ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. హోటల్ స్టాఫ్ పాస్‌పోర్ట్ తెచ్చి ఇచ్చేంత వరకూ బస్సు డోర్ దగ్గరే ఉన్న హిట్ మ్యాన్.. తర్వాత వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. దీంతో టీమ్ మేట్స్ గట్టిగా అరుస్తూ రోహిత్‌ను ఆటపట్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుక్కయ్యాన్రా బాబు అన్నట్టుగా.. రోహిత్ బ్లాంక్‌గా ముఖం పెట్టడాన్ని ఈ వీడియోలో గమనించొచ్చు.

అనంతరం కొలంబో నుంచి బయల్దేరిన భారత ఆటగాళ్లు సోమవారం ఉదయం ముంబై చేరుకున్నారు. భారత జట్టు వరల్డ్ కప్‌కి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ 2023లో రోహిత్ కెప్టెన్‌‌గానే కాకుండా ఆటగాడిగానూ సత్తా చాటాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధికంగా రెండుసార్లు ఆసియా కప్ నెగ్గిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్‌ల సరసన రోహిత్ నిలిచాడు. ఆసియా కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోనీ, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ రికార్డును రోహిత్ సమం చేశాడు.