ఐసీసీ టోర్నీ నా అడ్డా రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్

భారత క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ల పేర్లు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు... మొదట కపిల్ దేవ్...తర్వాత మహేంద్రసింగ్ ధోనీ... ఇప్పుడు రోహిత్ శర్మ... కానీ ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 12:50 PMLast Updated on: Mar 11, 2025 | 12:50 PM

Rohit Sharma Sets New Record In Icc Tournament

భారత క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ల పేర్లు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు… మొదట కపిల్ దేవ్…తర్వాత మహేంద్రసింగ్ ధోనీ… ఇప్పుడు రోహిత్ శర్మ… కానీ ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 9 నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టైటిల్స్ అందించిన సారథిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్ సారథ్యంలో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్‌​ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో గెలవడం ద్వారా మూడో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. తద్వారా 25 ఏళ్ళ క్రితం కివీస్ చేతిలో ప‌రాభావానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో రోహిత్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి భారత సారథిగా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలవడంతో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించలేదు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. మరికొన్ని రికార్డులను కూడా హిట్ మ్యాన్ సొంతం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్‌బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్‌ 88 శాతం, గంగూలీ 80శాతంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న నాలుగో సారథిగా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయడ్, రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ కంటే ముందున్నారు. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. నాలుగు ఐసీసీ టైటిళ్లతో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా 2003 వన్డే ప్రపంచకప్, 2007 వన్డే ప్రపంచకప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.

వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయడ్ 1975 వన్డే ప్రపంచకప్‌తో పాటు 1979 వన్డే ప్రపంచకప్ గెలిచాడు. ప్యాట్ కమిన్స్ 2023 డబ్ల్యూటీసీ, 2023 వన్డే ప్రపంచకప్ సాధించాడు. తాజాగా రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఆటగాడిగా రోహిత్ శర్మకు ఇది నాలుగో ఐసీసీ టైటిల్. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పట్లో తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని హిట్ మ్యాన్ ప్రకటించడంతో 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడంటూ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.