డీకేను దాటేసిన రోహిత్ ,హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డ్…!
ఐపీఎల్ సీజన్ ను ఎప్పటిలానే ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 155 పరుగులకే ముంబై పరిమితమవగా...

ఐపీఎల్ సీజన్ ను ఎప్పటిలానే ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 155 పరుగులకే ముంబై పరిమితమవగా… రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీలతో చెన్నై గెలుపును అందుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రెండో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ రికార్డును అధిగమించాడు.రోహిత్ శర్మ ఆడిన 258వ మ్యాచ్ ఇది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎమ్మెస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 265 మ్యాచులు ఆడాడు. ఆ జాబితాలో మూడో ఆటగాడిగా 257 మ్యాచ్‌లతో దినేశ్ కార్తీక్ ఉన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ 253 మ్యాచ్ లు, జడేజా 241 మ్యాచ్ లు, ధావన్ 222 మ్యాచ్ లు, అశ్విన్ 213 మ్యాచ్ లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. రైనా, ఊతప్ప 205 మ్యాచ్ ల చొప్పున ఆడగా.. అంబటి రాయుడు 204 మ్యాచ్ లు ఆడాడు.
కాగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ప్రయాణం 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ప్రారంభమైంది. అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ అయ్యాడు. ఆ టీమ్‌కు ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లను అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ ఇంతకుముందు జరిగిన 17 సీజన్లలో 29.72 సగటుతో 2 సెంచరీలతో 6,628 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే 18వ సీజన్ ను మాత్రం రోహిత్ పేలవంగా ప్రారంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.ఈ వైఫల్యంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా.. దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రికార్డ్‌లను రోహిత్ సమం చేశాడు. ఇప్పటి వరకు రోహిత్ 18 సార్లు డకౌటయ్యాడు.
ఈ జాబితాలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 18 డకౌట్స్‌తో టాప్‌లో ఉండగా.. సునీల్ నరైన్, పియూష్ చావ్లా 16 డకౌట్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. 18 సీజన్లలో 18 సార్లు డకౌటై రోహిత్ లెక్క సమం చేశాడని, మరోసారి డకౌట్ అవ్వడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్‌పై గట్టిగానే పడింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన ముంబై 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో ముంబైని దెబ్బకొట్టాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కాస్త తడబడినా రుతురాజ్, రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీలతో టార్గెట్ ను అందుకుంది.