రోహిత్ సలహా కాపాడింది.. హర్షిత్ రాణా కామెంట్స్..
భారత క్రికెట్ లో ప్రస్తుతం హర్షిత్ రాణా పేరు మారుమోగిపోతోంది. టీ ట్వంటీ అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ యువ పేసర్ తాజాగా వన్డే అరంగేట్రంలోనూ దుమ్మురేపాడు. పరుగులు ఇచ్చినా కీలక వికెట్లతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ తో కలిసి హర్షిత్ రాణా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

భారత క్రికెట్ లో ప్రస్తుతం హర్షిత్ రాణా పేరు మారుమోగిపోతోంది. టీ ట్వంటీ అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ యువ పేసర్ తాజాగా వన్డే అరంగేట్రంలోనూ దుమ్మురేపాడు. పరుగులు ఇచ్చినా కీలక వికెట్లతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో యశస్వి జైస్వాల్ తో కలిసి హర్షిత్ రాణా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వన్డేల్లో తొలి మ్యాచ్ కావడంతో ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనై పరుగులు ఇచ్చేశాడు. ఇంగ్లాండ్ జట్టు కూడా హర్షిత్ రాణాపై ఎటాకింగ్ బ్యాటింగ్ చేసింది. కానీ రాణా పుంజుకుని ఇంగ్లిష్ బ్యాటర్లని ఒక్కొక్కరిని పెవిలియన్ కి దారి చూపాడు. 10వ ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. మంచి ఫామ్ లో ఉన్న బెన్ డకెట్ , హ్యారీ బ్రూక్ వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అయితే తన సక్సెస్ వెనుక రోహిత్ శర్మ ఉన్నట్లు రాణా చెప్పాడు. రాణా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ యువ పేసర్ ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. రాణా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. అప్పుడు రోహిత్ సలహా తీసుకున్నట్లు రాణా చెప్పాడు.అప్పుడు రోహిత్ శర్మ తనను స్టంప్స్ వద్ద బౌలింగ్ చేయమని చెప్పాడు. అలా బలంగా పుంజుకున్నానని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ సలహాతోనే తిరిగి లయను అందుకున్నానని చెప్పుకొచ్చాడు. మొదట్లో పరుగులు ఇచ్చినా తన లైన్ అండ్ లెంగ్త్ ను మాత్రం కోల్పోలేదన్నాడు.
కాగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌తో హర్షిత్ రాణా తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. దీంతో రాణా కంకషన్ ప్రత్యామ్నాయంగా బౌలింగ్ వేశాడు. త 4 ఓవర్లు బౌలింగ్ చేసి 8.20 ఎకానమీతో 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 7 ఓవర్లు బౌలింగ్ చేసి 7.60 ఎకానమీతో 53 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో రాణా వన్డే అరంగేట్రం అద్భుతంగా మొదలైంది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.