ధోనీని దాటేశాడుగా క్లీన్ స్వీప్ లో రోహిత్ రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 05:40 PMLast Updated on: Feb 14, 2025 | 5:40 PM

Rohits Clean Sweep Past Dhonis Record

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దాని కంటే ముందు టీ ట్వంటీ సిరీస్ ను 4-1తో గెలిచిన రోిహిత్ సేన వన్డే సిరీస్ లోనూ దుమ్మురేపింది. ఇంగ్లాండ్ జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మూడు మ్యాచ్ లూ దాదాపు వన్ సైట్ గా ముగిసాయి. అందరూ ఊహించినట్టుగానే భారత్ స్టార్ ప్లేయర్స్ అందరూ ఫామ్ లోకి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రాణించారు. అటు బౌలర్లు కూడా సత్తా చాటారు. ఫలితంగా వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. గిల్ సెంచరీతో కదం తొక్కడంతో 356 పరుగుల భారీస్కోర్ చేయగా.. ఇంగ్లాండ్ 214 పరుగులకే కుప్పకూలింది. దీంతో సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను అందుకున్నాడు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్‌ను అధిగమించాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్‌‌పై సిరీస్‌లను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.గతంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల నాయకత్వంలో టీమిండియా మూడేసి సార్లు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా 4 వేర్వేరు దేశాలపై క్లీన్ స్వీప్ చేసిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్‌లో 14 ఏళ్లలో అత్యధిక క్లీన్ స్వీప్‌‌లను సాధించిన జట్టుగా నిలిచింది. టీమిండియా గత 14 ఏళ్లలో 12 సార్లు వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తర్వాత న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్‌లతో రెండో స్థానంలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ సిరీస్ తో రోహిత్ శర్మ కూడా ఫామ్ అందుకున్నాడు. గత ఏడాది కాలంగా స్థాయికి తగినట్టు ఆడలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హిట్ మ్యాన్ దాదాపు రిటైర్మెంట్ ప్రకటన చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఆసీస్ టూర్ లోనే టెస్టులకు వీడ్కోలు పలకాలని భావించాడు. మళ్ళీ సన్నిహితుల సలహాతో వెనక్కి తగ్గాడు. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో నిరాశపరిచిన రోహిత్ తర్వాత రెండో వన్డేలో మాత్రం సెంచరీతో దుమ్మురేపాడు. రెండో వన్డేలో 90 బంతుల్లోనే 119 రన్స్ చేశాడు. వన్డేల్లో అతనికిది 32వ సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ ఫామ్ లోకి రావడం అభిమానులను ఖుషీ చేసింది అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్లలో రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు సారథిగానే అరుదైన రికార్డు అందుకున్న హిట్ మ్యాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.