రోహిత్ ఫ్లాప్ షో కంటిన్యూ లోపం అదే అంటున్న మాజీలు

స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా సిరీస్ చేజార్చుకోవడానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ జట్టుకు ఇబ్బందిగా మారింది. పరుగుల వరద పారించే వీరిద్దరూ వైఫల్యాల బాటను వీడలేకపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 05:03 PMLast Updated on: Nov 02, 2024 | 5:03 PM

Rohits Flop Show Continues

స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా సిరీస్ చేజార్చుకోవడానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ జట్టుకు ఇబ్బందిగా మారింది. పరుగుల వరద పారించే వీరిద్దరూ వైఫల్యాల బాటను వీడలేకపోతున్నారు. రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. సరైన ఆరంభాలను ఇవ్వడంలో హిట్ మ్యాన్ విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 80 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. రోహిత్ వైఫల్యంతో న్యూజిలాండ్.. టీమిండియా గడ్డపై టెస్ట్ విజయం సాధించడమే కాకుండా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ పై మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ టెక్నిక్ లోనే లోపం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్య రోహిత్ శర్మకు బలహీనతగా మారిందని విశ్లేషించారు. రోహిత్ శర్మ పేస్ బౌలర్లకు ఒకే తరహాలో వికెట్లు ఇచ్చుకుంటున్నాడని కుంబ్లే చెప్పాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మను పేసర్లు ఇబ్బంది పెడుతున్నారని, ఇది ఆందోళన కలిగిస్తోందన్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో కూడా రోహిత్ శర్మ ఇలానే ఔటయ్యాడని కుంబ్లే గుర్తు చేశాడు. టీమ్ సౌథీ ఈ వీక్ నెస్ ను గుర్తించి అదే బంతితో ఔట్ చేశాడని చెప్పుకొచ్చాడు. తాజాగా మ్యాట్ హెన్రీ కూడా అదే ఫార్మూలాతో బౌలింగ్‌ చేసి రోహిత్ శర్మను పెవిలియన్ పంపాడన్నారు.

గత కొన్ని సిరీస్ ల నుంచి రోహిత్ ఒకేరీతిలో ఔటవుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్‌ బాల్ వేసి రోహిత్ శర్మను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ బంతి ఆడే విషయంలో రోహిత్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. బంతి స్వింగ్ అవుతుందేమోనని పొరబడి రోహిత్ మూల్యం చెల్లించుకుంటున్నాడు. వీలైనంత త్వరగా రోహిత్ ఈ సమస్యను అధిగమించాలని మాజీ ప్లేయర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కంగారూ పిచ్ లపై ఆసీస్ బౌలర్లు కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తారని అనిల్ కుంబ్లే అంచనావేశాడు. కాగా కుంబ్లే అభిప్రాయంతో సైమన్ డౌల్ కూడా ఏకీభవించాడు. ఈ బలహీనతపై రోహిత్ కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందేనని సూచించాడు.