వన్డేలకు ఇక రోహిత్ గుడ్ బై ? ఫైనల్ తర్వాత ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. 2000 ఎడిషన్ ఫైనల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవడం ద్వారా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫైనల్ కు ముందు షాకింగ్ న్యూస్ తెలిసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా రోహిత్ వన్డేల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. మంచి ఆరంభాలనే ఇస్తున్నా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నిస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. పైగా ఇప్పటికే వయసు 38కి వచ్చేసింది. దీంతో అతడి ఫిజికల్ ఫిట్ నెస్ కూడా సహకరించట్లేదు.
అందుకే ఇప్పుడు రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫైనల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఘనంగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఫిక్స్ అయ్యాడట. అయితే టెస్టుల్లో మాత్రం మరో ఏడాది పాటు కొనసాగుతాడని తెలిసింది. అలానే ఐపీఎల్ లో కూడా ఇంకొన్నేళ్ల పాటు కొనసాగుతాడని సమాచారం అందింది. ఏదేమైనా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన, ఓడినా తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని రోహిత్ ప్రకటిస్తాడని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అలానే ఇప్పుడు రోహిత్ శర్మ వన్డేలకు గుడ్ బై చెబుతారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే కోహ్లీ మాత్రం ఇంకొంతకాలం వన్డేల్లో కొనసాగుతాడని, అతడి ఫిజికల్ కండిషన్ బానే ఉందని, 2027 వరల్డ్ కప్ కూడా ఆడుతాడని చెబుతున్నాయి. ఏదేమైనా వన్డే క్రికెట్ నుంచి రోహిత్ తప్పుకుంటే మాత్రం,భారత క్రికెట్ లో ఓ శకం ముగిసినట్టేనని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
గడిచిన 18 ఏళ్లలో రోహిత్ శర్మ నిలకడగా రాణించాడు. 2022లో విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును అన్ని ఫార్మాట్లలోనూ ముందుకు నడిపించాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి 497 మ్యాచ్‌ల్లో 42.14 సగటుతో 19596 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2007లో ఐర్లాండ్ పై రోహిత్ వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 272 వన్డేల్లో 11 వేల 92 పరుగులు చేశాడు. దీనిలో 32 సెంచరీలు. 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డే క్రికెట్ లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో ఇది చాలా గొప్ప విషయం. 2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ డబుల్ సెంచరీ చేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన చేరాడు. ఆ తర్వాత కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. తన పెళ్లి రోజున మొహాలీలో శ్రీలంకపై 208 పరుగులు చేసి మూడో డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు చేసి ఇంతకు ముందు రికార్డు సృష్టించాడు. రోహిత్ 2019 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సెంచరీలు చేశాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 2003లో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ లో రోహిత్ అందుకున్న కొన్ని రికార్డులను ఇప్పట్లో ఎవరూ అధిగమించే అవకాశాలు లేవు.