గేల్ ను దాటేసిన రోహిత్ హిట్ మ్యాన్ సిక్సర్ల రికార్డ్
భారత క్రికెట్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. సింగిల్స్ కంటే బౌండరీలు, సిక్సర్లు అలవకోగా బాదేస్తుంటాడు.. అందుకే రోహిత్ ను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు.

భారత క్రికెట్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. సింగిల్స్ కంటే బౌండరీలు, సిక్సర్లు అలవకోగా బాదేస్తుంటాడు.. అందుకే రోహిత్ ను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. రోహిత్ క్రీజులో ఉండే కొద్దిసేపట్లో ఖచ్చితంగా సిక్సర్లు కొడతాడు. తన అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్.. తాజాగా వన్డేల్లో క్రిస్ గేల్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లు మూడో సిక్స్ బాది క్రిస్ గేల్‌ను అధిగమించాడు. గస్ అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్.. సకీబ్ మహ్మూద్ వేసిన మరుసటి ఓవర్‌లో మరో సిక్స్ కొట్టాడు. మహ్మూద్ వేసిన ఐదో ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి క్రిస్ గేల్ అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించాడు.
క్రిస్ గేల్ 301 వన్డే మ్యాచ్‌ల్లో 331 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 335 సిక్స్‌లత కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స్‌లు కొట్టాడు. మరో 16 సిక్స్‌లు బాదితే హిట్ మ్యాన్ అతన్ని కూడా అధిగమించనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోపు రోహిత్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 626 సిక్స్‌లు కొట్టాడు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డేల్లో సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్ 119 పరుగులు చేశాడు. 76 బంతుల్లోనే శతకం సాధించిన భారత కెప్టెన్ కు ఇది వన్డేల్లో 32వ సెంచరీ. అలాగే వన్డేల్లో అతనికిది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. దాదాపు ఐదు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ మూడంకెల స్కోర్ అందుకున్నాడు. గతకొంతకాలంగా వైఫల్యాల బాటలో ఉన్న భారత సారథి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రిటైర్మెంట్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్న వేళ సెంచరీతో అదరగొట్టాడు.