Sachin Tendulkar: సచిన్‌కు అరుదైన గౌరవం.. ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్‌గా క్రికెట్ లెజెండ్..!
ఎలక్షన్ కమిషన్ (ఈసీ) జాతీయ ఐకాన్‌గా సచిన్‌ను నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సచిన్‌ను ఐకాన్‌గా నియమించింది. దీనిపై ఈసీకి, సచిన్‌కు మధ్య ఢిల్లీలోని రంగ్ భవన్‌లో బుధవారం (ఆగష్టు 23) ఒప్పందం కుదరనుంది.
Sachin Tendulkar : క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎలక్షన్ కమిషన్ (ఈసీ) జాతీయ ఐకాన్‌గా సచిన్‌ను నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సచిన్‌ను ఐకాన్‌గా నియమించింది. దీనిపై ఈసీకి, సచిన్‌కు మధ్య ఢిల్లీలోని రంగ్ భవన్‌లో బుధవారం (ఆగష్టు 23) ఒప్పందం కుదరనుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్రపాండే, అరుణ్ గోయెల్ సమక్షంలో ఈ ఒప్పందం కుదర్చుకోనున్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ మొదలైంది. ఈ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే జనవరిలో మరో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఏపీతోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతాయి. అందుకే ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. దీనికోసం వివిధ రంగాల ప్రముఖుల్ని ఈసీ ప్రచారకర్తలుగా, ఐకాన్స్‌గా నియమిస్తుంటుంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన వారిని ఇందుకు ఎంపిక చేస్తుంది. గతంలో నటులు పంకజ్ త్రిపాఠి, ఆమిర్ ఖాన్, బాక్సర్ మేరీ కోమ్, క్రికెటర్ ఎమ్మెస్ ధోని, డాక్టర్ నీరు కుమార్‌ను ఈ స్థానంలో నియమించింది.
ఇప్పుడు సచిన్ టెండూల్కర్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ నియామకం ద్వారా ఓటు హక్కుపై సచిన్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తారు. సచిన్‌తో ఈ ఒప్పందం మూడేళ్ల వరకు అమలులో ఉంటుంది. సచిన్.. క్రికెట్‌లో అరుదైన రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 200 టెస్టు మ్యాచులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. రాజ్యసభ ఎంపీగానూ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు.