దోస్త్ మేరా దోస్త్.. సచిన్ చేయి విడవని కాంబ్లీ
భారత క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ స్థాయిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ జోడీ తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెట్ లో అభిమానులను అలరించింది.

భారత క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ స్థాయిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ జోడీ తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెట్ లో అభిమానులను అలరించింది. ఫీల్డ్ బయట సచిన్, కాంబ్లీ మధ్య స్నేహం గురించి కూడా అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ముంబైలో ఓ ఈవెంట్ సందర్బంగా కలిసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇద్దరూ ఇండియన్ క్రికెట్ లోకి దూసుకొచ్చి తమదైన ముద్ర వేసిన తీరు కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచమే మెచ్చిన గొప్ప క్రికెటర్ గా నిలవగా.. మరొకరు మొదట్లోనే కనుమరుగైపోయారు. ఇప్పుడు వినోద్ కాంబ్లి పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడు. సచిన్, కాంబ్లీ ఇద్దరూ అచ్రేకర్ దగ్గర శిష్యరికం చేసిన వారే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరూ రికార్డులు బద్దలుగొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి ఒకరిని మించి మరొకరు పేరు సంపాదించారు. తర్వాత సచిన్ క్రికెట్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కానీ, కాంబ్లి వైభవం కనుమరుగైంది. కనీసం అతనెక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియనంతగా ఆటకు దూరమయ్యాడు.
దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈవెంట్లో సచిన్ ను కలిశాడు కాంబ్లి. అతన్ని చూడగానే భావోద్వేగానికి గురైన కాంబ్లి.. స్టేజ్ పైకి వచ్చిన సచిన్ చేయి పట్టుకొని వదలకుండా అలాగే ఉండిపోయాడు. సచిన్ మాత్రం చేయి వదిలించుకొని ముందుకు సాగాలని అనుకున్నా.. కాంబ్లి మాత్రం వదల్లేదు. పక్కనే ఉన్న వ్యక్తి చొరవతో మొత్తానికి సచిన్ ముందుకు సాగాడు. ఈవెంట్ తర్వాత కూడా సచిన్ తో కాంబ్లి ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. మాస్టర్ తలపై ఆప్యాయంగా నిమురుతూ కాంబ్లి మాట్లాడాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.