రికార్డులను అడ్డుకునే శాడిజం, హార్థిక్ ను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

ఐపీఎల్ 18వ సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్ లో యువ పేసర్ అశ్వని కుమార్ సంచలన బౌలింగ్ హైలెట్ గా నిలిచింది. సత్యనారాయణ రాజు స్థానంలో తుది జట్టులోకి వచ్చిన అశ్వని కుమార్ 4 వికెట్లతో కోల్ కత్తాను దెబ్బకొట్టాడు. అయితే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అతనికి పూర్తి స్పెల్ ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది. పరుగులు పెద్దగా ఇవ్వకుండా కీలక వికెట్లు తీసిన అశ్వని కుమార్ 3 ఓవర్లలో 23 రన్స్ కు 4 వికెట్లు తీశాడు. ఇంకో ఓవర్ వేసే అవకాశం ఉన్నా హార్థిక్ అతన్ని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐదు వికెట్లు తీసే అరుదైన ఘనతను కావాలనే దూరం చేశాడని ఆరోపిస్తున్నారు.
సహచర ఆటగాళ్ల రికార్డులను అడ్డుకోవడం హార్దిక్ పాండ్యాకు అలవాటేనని ఫైర్ అవుతున్నాడు. పాండ్యా నీకు ఇదేం సరదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. హార్దిక్ పాండ్యా మరీ ఇంత స్వార్థపరుడని తాము అనుకోలేదని, అతనికి ఎందుకు ఇంత కుళ్లు అని మండిపడుతున్నారు. అతను 13వ ఓవర్‌లో చివరిసారిగా బౌలింగ్ చేయగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ 16.2 ఓవర్లలో ముగిసింది. తర్వాతి నాలుగు ఓవర్లలో ఒక్క ఓవర్ బౌలింగ్ ఇచ్చినా అశ్వని కుమార్‌కు ఐదు వికెట్ల ఘనత దక్కేది. తద్వారా అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన ఘనత అతని సొంతమయ్యేది. కానీ హార్దిక్ పాండ్యా అశ్వని కుమార్‌కు కాకుండా.. మిచెల్ సాంట్నర్, విజ్ఞేష్ పుతుర్‌తో బౌలింగ్ చేయించాడు. వారు చెరో వికెట్ తీసి కేకేఆర్ ఇన్నింగ్స్‌కు తెరదించారు. అశ్విని కుమార్‌కు మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని కామెంటేటర్లు కూడా తప్పుబట్టారు. అసలు హార్దిక్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
గతంలో కూడా పలుసార్లు పాండ్యా ఇలాగే ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని కూడా హార్దిక్ పాండ్యా ఇలానే అడ్డుకున్నాడని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ విరాట్ కోహ్లీ సెంచరీకి ఇలానే హార్దిక్ అడ్డుతగిలాడని, భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడని కామెంట్ చేస్తున్నారు. కామన్‌సెన్స్ లేకుండా హార్దిక్ పాండ్యా ఇలా ఎందుకు చేస్తాడో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.