దుమ్మురేపుతున్నాడుగా సాయిసుదర్శన్ పరుగుల వరద..!
ఐపీఎల్ ఎప్పుడు జరిగిన ఆరెంజ్ క్యాప్ రేసులో స్టార్ క్రికెటర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి.. కానీ ప్రస్తుత 18వ సీజన్ లో మాత్రం యువ క్రికెటర్ సాయిసుదర్శన్ అత్యధిక పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు.

ఐపీఎల్ ఎప్పుడు జరిగిన ఆరెంజ్ క్యాప్ రేసులో స్టార్ క్రికెటర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి.. కానీ ప్రస్తుత 18వ సీజన్ లో మాత్రం యువ క్రికెటర్ సాయిసుదర్శన్ అత్యధిక పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. ఈ గుజరాత్ ఓపెనర్ వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. పరుగుల వేటలో సాధారణంగా కోహ్లీ, గిల్ లేదా రాహుల్ వంటి వారి పేర్లే వినిపిస్తుంటాయి. కానీ వీరందరినీ దాటేసిన సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తూ గుజరాత్ విజయాల్లో కీలకంగా మారిపోయాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులోనూ సాయి సుదర్శన్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ బాది క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు.
ఈ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ 8 మ్యాచ్‌ల్లోనే 52.13 సగటుతో 417 పరుగులు సాధించాడు. అందులో ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ సీజన్ లో తాను ఆడిన తొలి మ్యాచ్లో ఫిఫ్టీ, రెండో మ్యాచులో ఫిఫ్టీ, మూడో మ్యాచులో 40, ఐదో మ్యాచులో ఫిఫ్టీ, ఆరో మ్యాచులో ఫిఫ్టీ, ఏడో మ్యాచులో 30, ఇప్పుడు 8వ మ్యాచులో మరో 50 బాది అదరగొట్టాడు. గత సీజన్లోనే సుదర్శన్ అదరగొట్టాడు. ఈ సారి ఇంకా గొప్పగా రాణిస్తున్నాడు. గత సీజన్లో సుదర్శన్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. వేగం లేదనే విమర్శలు వినిపించాయి. కానీ ప్రస్తుత సీజన్లో తన దూకుడు పెంచాడు సుదర్శన్. అతడి స్ట్రైక్ రేట్ 152 వరకు ఉంది.
తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి టైటాన్స్‌కు అద్భుత ఆరంభాలనిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్ గత 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచిందంటే అందులో సుదర్శన్ రోల్ చాలానే ఉంది. ఇదిలా ఉంటే 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ ఈ సారి కూడా టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. ఆ టీమ్ ఇప్పటివరకూ పంజాబ్, లక్నో చేతిలో మాత్రమే ఓడింది.