Sania Mirza: సానియా మీర్జా ట్రెండ్ సెట్టర్‌గా ఎలా మారారు..?
సానియా మీర్జా ఈ పేరు మన చెవులకు వినపడగానే టెన్నీస్ స్టార్ ప్లేయర్ అనేంతలా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. టెన్నీస్ ఆట ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యంలో ఉన్నప్పటికీ మన దేశంలో ఈ ఆటకు ఇంత ప్రాముఖ్యం ఉంటుందని ఆ మధుర జ్ఞాపకాలను రుచి చూపించింది మాత్రం ఆ క్రీడాకారిణే. ఆటలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో అంతే పోరాటం తన జీవితంలో కూడా ఉంది. తాజాగా మంగళవారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ లో ఆటను ఆడినప్పటికీ పరాజయం ఎదురైంది. ఎక్కడైతే తన కెరీయర్ ప్రారంభమైందో అదే వేదికపై ఓటమి చవిచూడటంపై క్రీడా అభిమానులకు కాస్త నిరాశపరిచింది. ఇలాంటి ఆటుపోట్లకు ఆమె కుంగిపోలేదు. ఇకపై వ్యాఖ్యాతగా, కోచ్ గా, మెంటార్ గా రాణిస్తానని చెప్పుకొచ్చారు సానియా. ఇంతటి అద్భతమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఆమె ఎలా కష్టపడ్డారో తెలుసుకోవాలని ప్రతిఒక్కరిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ వివరణాత్మక ప్రస్తానం.
సానియా 1986 నవంబర్ 15న ముంబాయ్ మహానగరంలో జన్మించారు. ఈమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈయన ఒక బిల్డర్. తల్లి పేరు నసీమా. ఈమె ప్రింటింగ్ ప్రెస్ రంగంలో పనిచేసేవారు. సానియాకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు ఆనంద్ మీర్జా. సానియా పుట్టిన కొన్ని రోజులకు వ్యాపార నిమిత్తం హైదరాబాద్ కి వచ్చారు. ఇక్కడే మంచి కుటుంబ వాతావరణంలో పెరిగారు. క్రికెట్ ఆటగాడు గులాం ఆహ్మద్, పాకిస్తాన్ క్రీడాకారుడు ఆసీఫ్ ఇగ్భాల్ కు సానియా దూరపు బంధువు అవుతారు.
బాల్యం నుంచే ఆటపై ఆసక్తి:
ఈమె తన ఆరు సంవత్సరాల వయస్సులో తన తండ్రి శిక్షణలో టెన్నీస్ ఆడటం ప్రారంభించారు. తరువాత రావెర్ ఆండ్రసన్ వద్ద మెరుగైన శిక్షణ పొందారు. నాసర్ స్కూల్ లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి సెయింట్ మేరీస్ కళాశాలలో చదివి డిగ్రీ పట్టా పొందారు. కొంతకాలం ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు. 2008 డిశంబర్ 11న ఎంజీఆర్ ఎడ్యూకేషనల్ రీసర్చ్ ఇన్సిట్యూట్ ఆమెకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈమె బాల్యం నుంచే ఈతను కూడా నేర్చుకున్నారు. ఇందులో మంచి ప్రావిణ్యం కూడా ఉంది. ఇలా తన ఉన్నత విద్యను పూర్తి చేసి టెన్నీస్ పై ఆసక్తితో క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. ఈమెకు జీవీకే, అడిడాస్ సంస్థలు వెనుకుండి ప్రోత్సాహం అందించాయి.
15 ఏళ్లకే ఘనమైన విజయాలు:
2001 ఏప్రిల్ లో ఐటిఎఫ్ ఇంటర్నేషనల్ టెన్నీస్ ఫెడరేషన్ సర్క్యూట్లో 15 ఏళ్ల ప్రాయంలో తొలిసారిగా సీనియర్స్ విభాగంలో అడుగు పెట్టిన ఆమె చాలా తక్కువ సమయంలోనే ఘనమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. 2001 పూనే క్వాటర్ ఫైనల్స్ లోనూ.. ఢిల్లీలో ఆడిన సెమీ ఫైనల్స్ లోనూ తనదైన ఆటతీరును కనబరిచారు. 2002లో తొలుత ఘోరమైన అపజయాలు చవిచూసినప్పటికీ స్వస్థలం హైదరాబాద్ లో ఫిలిపిన్స్ లోని మనీలాలో వరుసగా మూడు టైటిల్స్ ను కైవసం చేసుకున్నారు. ఆతరువాత సనా బమ్రీతో కలిసి 2002 యూఎస్ ఓపెన్ బాలికల డబుల్స్ లో క్వాటర్ ఫైనల్స్ కి చేరుకున్నారు. 2003లో టెన్నీస్ జూనియర్స్ విభాగంలో సానియా ఆడారు. సింగిల్స్లో 10, డబుల్స్ లో 3 గెలిచారు. ఆలిసర్ క్లబేనియోతో కలిసి అదే సంవత్సరం వింబుల్డన్ ఛాంపియన్ షిప్ లో బాలికల డబుల్స్ గెలిచారు.
20 ఏళ్లకు పద్మశ్రీ అవార్డు:
ఇదంతా ఆమె ఆటలో తేరంగేట్రం చేసిన నాటి కథ. ఇక ఆమె నిజ జీవితంలో చూస్తే చాలా మలుపులు, కీలకమైన ఘట్టాలూ కనిపిస్తాయి. ఫిబ్రవరి 2003లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ హైదరాబాద్ ఓపెన్ లో మొదటి సారి డబ్యూటిఏ టోర్నమెంట్లో ఆడారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇవీ డోమినీ కోవిక్ తో 6-2, 1-6, 2-6 తేడాతో ఓడిపోయారు. ఆతరువాత క్వాటర్ లేడీస్ ఓపెన్ లో చెకోస్ లోవియాకి చెందిన ఓల్గా బ్లొహాటోవా పై గెలిచి మొదటి రౌండుకు ఎంపికయ్యారు. 2002లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ లో లియాండర్ ఫేస్ తో కలిసి భారతదేశానికి కాంస్య పధకాన్ని అందించారు. మరుసటి సంవత్సరం హైదరాబాద్ లో జరిగిని ఆఫ్రో ఆసియా క్రీడలు – 2003లో ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నాలుగు బంగారు పధకాలు గెలుచుకున్నారు సానియా మీర్జా. 2004లో కేంద్రప్రభుత్వం అర్జునా అవార్డుతో సత్కరించింది. 2005 ఆస్ట్రేలియన్ సింగల్ ఓపెనింగ్స్ లో మూడవరౌండు వరకూ వెళ్లి సంచలనం సృష్టించారు. అక్టోబర్ 2005లో టైమ్స్ పత్రిక ఫిప్టీ హీరోస్ ఆఫ్ ఆసియాగా ప్రచురించింది. ది ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక థర్టీత్రీ ఉమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్ జాబితాలో చేర్చింది. 2006లో ఆమెకు 20 సంవత్సరాల వయస్సులో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2007 సింగిల్స్ లో ప్రపంచంలో 27వ ర్యాంకులో నిలిచారు. 2008 ఒలంపిక్స్ లో పాల్గొన వలసిన సానియా ఇలా విజయాలు సాధించిన క్రమంలో మణికట్టుకు తీవ్ర గాయం ఏర్పడటం వల్ల సింగిల్స్ కు దూరమయ్యారు. 2009 జూలై 10న చిన్ననాటి స్నేహితుడు సోహరిబ్ మీర్జాతో నిశ్చితార్థం జరిగింది. ఆరునెలల్లో అభిప్రాయ భేదాల కారణంగా ఆ నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నారు ఇరు కుటుంబీకులు. 2010 ఏప్రిల్ 12న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్నారు సానియా.
దశాబ్థం పాటూ విశ్రమించని పోరాటం:
2003 నుంచి 2013 వరకూ సింగల్స్ నుంచి రిటైర్డ్ అయ్యేదాకా ఉమెన్స్ టెన్నీస్ అసోసియేషన్ లో భారత్ నుంచి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రథమ స్థానాన్ని చెరిగిపోకుండా చిరస్థాయిగా లిఖించుకున్నారు. టెన్నీస్ బరిలో దూకినప్పటి నుంచే దూకుడుగా ఆడి గొప్ప క్రీడాకారిణిగా నిలిచారు. అథ్లెటిక్ క్రీడాకారిణిగా అధిక పారితోషకం తీసుకుంటారని పేరును గణించారు. సానియా మీర్జా టెన్నీస్ అకాడమీని స్థాపించి 3 నుంచి 8 సంవత్సరాలు వయస్సు కలిగిన వారికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీ ఏర్పాటు చేశారు. 2013 నవంబర్ 25న మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణాసియా నుంచి యూఎన్ మహిళల సౌహార్థ అంబాసిరేటర్ గా నియమించారు. చేతితో రాకెట్ పట్టుకొని విజయాలు లిఖించిన సానియా తల్లిగా కూడా రాణించింది.
ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ జోడీ:
2014 యూఎస్ ఓపెన్ లో సెమీ ఫైనల్స్ కు చేరిన సానియా జింబాంబ్వేకి చెందిన క్రీడాకారిణి బ్లక్ తో కలిసి తటపడ్డారు. మార్టినా హింగేస్, ఫ్లాబియా పెనటా చేతిలో ఓడిపోయారు. అదే ఓపెన్ పోటీలో మిక్స్డ్ డబుల్స్ లో బ్రెజిల్ క్రీడాకారుడు బ్రూనూ సరస్ తో కలిసి ఆడిన సానియా టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ఆమె కెరియర్ లో మూడవ మిశ్రమ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఇక సింగల్స్ కెరీయర్ గురించి చూస్తే ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లతో తలపడ్డారు. రష్యాకు చెందిన స్వెట్లనో కుసోవా, వెరాజెన్రోవా, ఫ్రెంచ్ కు చెందిన మరిన్ బర్టోలీ ప్రపంచంలో నెంబర్ వన్ ర్యాంకులు సాధించిన స్విస్ కు చెందిన మార్టినాహింగిస్, రష్యా దేశానికి చెందిన దినారాసఫ్నా వంటి క్రీడాకారులపై గుర్తించ దగ్గ విజయాలను సొంతం చేసుకున్నారు. డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించారు. తన కెరియర్లో వన్ మిలియన్ డాలర్లు సంపాధించడంతో పాటూ ఆరు ప్రతిష్టాత్మకమైన టైటిల్స్ దక్కించుకుని దేశంలో తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నారు. అదే సంవత్సరం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ గా కీర్తించారు. కోటి రూపాయలను ప్రభుత్వం తరఫున బహుమానంగా అందించారు. 2014లో మహిళా టెన్నీస్ అసోసియేషన్ ఫైనల్స్ లో అర్హత సాధించి టైటిల్ కూడా సాధించారు. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రా ఏషియా క్రీడల్లో 14 పధకాలు సాధించారు సానియా. అందులో 6 స్వర్ణ పధకాలే ఉండటం విశేషం. 2015లో సుమారు ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణితో జట్టుకట్టి 16 నెలల పాటూ సాగిన వీరి ప్రయాణంలో వరుసగా 44 మ్యాచుల్లో గెలవడంతో పాటూ ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ జోడీగా నిలిచారు. 2015లో మొత్తం 77 మ్యాచులు ఆడిన వీరి జోడి 65 మ్యాచుల్లో గెలవడం చెప్పుకోదగ్గ విషయం. ఇదే సంవత్సరంలో రాజీవ్ కేల్ రత్న అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
30 ఏళ్లకే పద్మభూషణ్ అవార్డు:
2016లో పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది. అది కూడా కేవలం 30 సంవత్సరాల వయస్సులోనే రావడం గొప్ప చరిత్రగా చెప్పాలి. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం అడుగుదూరంలో చేజారింది. 2018 అక్టోబర్ లో మాలిక్ సానియాలకు ఒక బాబు జన్మించాడు. ఇజాన్ మీర్జా మాలిక్ అని పేరు పెట్టారు. ఈ బిడ్డపై ఒక టీవీ ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. తన బాబును స్పోర్ట్స్ స్టార్ చేయనని గొప్ప డాక్టర్ గా చూడాలని ఉందని చెప్పారు సానియా. ఆతరువాత ఆడిన 2020 ఒలింపిక్స్‌లో విజయానికి దూరమైంది. 2016, 2020 రెండింటిలో నిరాశ తప్పలేదు. 2023 జనవరిలో ఇక ఆటకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సానియా మంగళవారం జరిగిన చివరి మ్యాచ్ ను ఆడేసింది. తనకు గతంలో దక్కిన గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కిన గడ్డమీదే ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ లో ఆటకు గుడ్ బై చెప్పింది. ఇకపై వ్యాఖ్యాతగా, కోచ్ గా, మెంటార్ గా సరికొత్తగా దర్శనమిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా సానియా మీర్జా ఇప్పుడు కొత్త క్రికెట్ కెరీర్ ప్రారంభిస్తోందని వార్తలు వస్తున్నాయి. క్రికెట్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతోందని కథనాలు వస్తున్నాయి. మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టుకు సానియా మీర్జా.. మెంటార్‌గా ఉండబోతోందనేలా ప్రచారం సాగుతోంది. తద్వారా ఇకపై ఆమె క్రికెట్‌లో తన జట్టు ద్వారా విజయాల పరంపర కొనసాగించే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు సానియా ఓడినప్పటికీ జీవితంలో గెలిచింది. చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలిచింది. భారత్ లో టెన్నీస్ అంటేనే తెలియని పరిస్థితుల నుండి నేడు ఆ ఆటకు ఒక స్టార్ డమ్ ను తీసుకొచ్చిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఇంతకంటే గొప్ప కీర్తి మరేముంటుంది. ఇలాంటి వారు మన దేశానికి మరికొంతమంది అవసరం. అప్పుడే మన జండా పరువు మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. దేశ ఖ‌్యతి ప్రపంచమంతా విస్తరించే అవకాశం ఉంటుంది.
T.V.SRIKAR