Dasun Shanaka: అదే మా జట్టు చేసిన తప్పు.. శ్రీలంక కెప్టెన్ డసన్ షనక

పిచ్ స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనే విషయాన్ని అంచనా వేయలేకపోయామని, 10 ఓవర్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించామని తెలిపాడు. అప్పటికీ తమకు అందుబాటులో ఉన్న పార్ట్ టైమ్ స్పిన్నర్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించామని చెప్పాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2023 | 06:32 PMLast Updated on: Sep 13, 2023 | 6:32 PM

Sensed Dunith Wellalage Would Do Something Special Says Dasun Shanaka

Dasun Shanaka: పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడమే తమ ఓటమిని శాసించిందని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా మంగళవారం భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పిచ్ స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనే విషయాన్ని అంచనా వేయలేకపోయామని, 10 ఓవర్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించామని తెలిపాడు. అప్పటికీ తమకు అందుబాటులో ఉన్న పార్ట్ టైమ్ స్పిన్నర్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించామని చెప్పాడు.

అయితే ముందే ఈ విషయాన్ని గ్రహిస్తే టీమిండియా మరింత తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేదని, అప్పుడు తమ విజయానికి ఆస్కారం ఉండేదన్నాడు. బ్యాటింగ్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీయగానే ఈ రోజు దునిత్ వెల్లలాగే చెలరేగుతాడని భావించానని తెలిపాడు. ‘ఈ తరహా వికెట్‌ను మేం అస్సలు ఊహించలేదు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్ అనుకున్నాం. కానీ 10 ఓవర్ల తర్వాత విషయాన్ని గ్రహించి ఈ అడ్వాంటేజ్‌ను గొప్పగా వాడుకున్నాం. పార్ట్‌టైమ్ స్పిన్నర్లు అయినా చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా సాయంతో భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించాం. ఈ ఇద్దరు బ్యాటర్లు నెట్స్‌లో తరుచూ బౌలింగ్ చేస్తుంటారు. ఈ ఇద్దరికీ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఈ రోజు వారి బౌలింగ్‌ను ఉపయోగించుకున్నా.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్లలాగే ఆట చూసి అతను భారత్‌తో సత్తా చాటుతాడని గ్రహించా. విరాట్ కోహ్లీని ఔట్ చేసిన క్షణమే ఈ రోజు వెల్లలాగేకు తిరుగులేదని భావించా. మరిన్ని వికెట్లు తీస్తాడని అనుకున్నా’ అని డసన్ షనక చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా ఆటగాళ్లు తమ వికెట్లు రాబట్టిన తీరుకు, పెవిలియన్ బయట కూర్చుని ఉన్న శ్రీలంక స్క్వాడ్ మొత్తం నివ్వెరపోయింది అంటూ షనక తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాడు.