వరల్డ్ కప్ విషయంలో బీసీసీఐకి సపోర్ట్ గా షాహిద్ ఆఫ్రిది
సుమారు 9 నెలలుగా చర్చోపచర్చలు, వాదోపవాదాల నడుమ ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం ఇటీవలే ముగియడంతో భారత్ - పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Shahid Afridi has come out in support of the ICC against Pakistan's opposition to World Cup cricket
ఆసియా కప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ విధానంలో పాక్‌లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా అంగీకారం తెలపడంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ కూడా ఇండియాకు వస్తుందని, రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సయోధ్య కుదిరినట్టేనని అంతా భావిస్తున్న తరుణంలో పీసీబీ చీఫ్ నజమ్ సేథీ చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.
శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నజమ్ సేథీ మాట్లాడుతూ.. ‘భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించి మేం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. అది ప్రభుత్వాల చేతుల్లో ఉన్న అంశం. ఆసియా కప్ ఆడేందుకు తమకు భద్రతా కారణాలున్నాయన్న బీసీసీఐ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో మా పరిస్థితి కూడా అంతే.. మేం అక్కడికి వెళ్లాలన్నా మా ప్రభుత్వం అనుమతించాలి… అహ్మదాబాద్‌లో ఆడతామా..? లేదా..? అన్న దానికంటే ముందు మేం అక్కడికి వెళ్తామా..? లేదా..? అన్నది మా ప్రభుత్వం తేల్చాలి.
ఒకవేళ ప్రభుత్వం అనుమతించకుంటే మాత్రం అక్కడికి వెళ్లి ఎలా ఆడగలం..? ఇదే విషయంపై మేం గతంలో కూడా మా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాం. మా ప్రభుత్వం నిర్ణయంపై మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది..’అని చెప్పాడు. కాగా పీసీబీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా అహ్మదాబాద్‌లో ఆడటం, ఆడకపోవడంపై ఆయన మాట్లాడాడు.
‘అహ్మదాబాద్‌లో ఎందుకు ఆడకుంటదని అనుకుంటున్నారు..? అదేమైనా నిప్పులు కురిపిస్తుందా..? లేక మిమ్మల్ని వెంటాడుతుందా..? మీరు అక్కడికి వెళ్లి ఆడాలి. గెలవాలి. మీరు ఊహించిన సవాళ్లను అధిగమించాలి. టీమిండియాను వాళ్ల వేలాది సొంత ప్రేక్షకుల మధ్య ఓడించడానికి వచ్చిన అవకాశాలపై పీసీబీ దృష్టి సారించాలి గానీ వెనుకడుగు వేయకూడదు. పీసీబీ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. భారత్‌ను సొంతగడ్డపై వారి ప్రేక్షకుల మధ్య ఓడిస్తే ఆ మజానే వేరు..’ అని అఫ్రిది తెలిపాడు. అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోయినా భారత్ – పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరిపించేందుకు బీసీసీఐ, ఐసీసీ ప్రయత్నాలు చేస్తున్నది.