మెగాటోర్నీ అంటే పూనకమే జహీర్ రికార్డ్ బ్రేక్ చేసిన షమీ
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మెగాటోర్నీ అంటే చాలు చెలరేగిపోతాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో షమీ ఎటువంటి బౌలింగ్ తో అదరగొట్టాడో అభిమానులు మరిచిపోలేరు.

భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మెగాటోర్నీ అంటే చాలు చెలరేగిపోతాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో షమీ ఎటువంటి బౌలింగ్ తో అదరగొట్టాడో అభిమానులు మరిచిపోలేరు. ఫైనల్ వరకూ భారత విజయాల్లో షమీదే కీరోల్… ఈ టోర్నీలో ఆద్యంతం చెలరేగిన షమీ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే మోకాలి గాయానికి సర్జరీ కారణంగా దాదాపు 15 నెలలు ఆటకు దూరమైన ఈ సీనియర్ పేసర్ ఇంగ్లాండ్ తో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. పూర్తిస్థాయిలో రిథమ్ అందుకోలేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా బౌలింగ్ చేస్తాడోనని అందరూ అనుకున్నారు. కానీ వారి అనుమానాలకు తెరదించుతూ షమీ బంగ్లాదేశ్ మ్యాచ్ తోనే అదరగొట్టాడు.
ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. తద్వారా మెగాటోర్నీలో మరోసారి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో షమీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. బంతులపరంగా ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో జాకెర్ అలీని క్యాచ్ ఔట్ చేయడం ద్వారా మహమ్మద్ షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 104 వన్డేల్లో మహమ్మద్ షమీ 200 వికెట్లను తీయగా.. మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ 107 మ్యాచ్‌లు, బ్రెట్‌లీ 112, అలన్ డోనాల్డ్117 మ్యాచ్ లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బంతుల పరంగా మాత్రం మహమ్మద్ షమీనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.అతను 5 వేల 126 బంతులు వేసి 200 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 5వేల 240 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించాడు.
సక్లెయిన్ ముష్తాక్, బ్రెట్ లీ, ట్రెంట్ బౌల్ట్, వకార్ యూనిస్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో మహమ్మద్ షమీ 72 వికెట్లతో టాప్ ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 18 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీసిన షమీ.. 14 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న షమీ మొత్తం 33 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసాడు. బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ లో షమీ తన పది ఓవర్ల స్పెల్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కు షమీ పెర్ఫార్మెన్స్ టీమిండియాకు తిరుగులేని ఆయుధంగా చెప్పొచ్చు.