అలా కంగారెత్తించాడు కింగ్ ఆఫ్ స్పిన్ షేన్ వార్న్
ఆస్ట్రేలియా అంటే ఫాస్ట్ బౌలర్లకే కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది... స్పిన్నర్లుగా రాణించేవారు ఆసీస్ నుంచి తక్కువగానే ఉంటారు. బంతిని గింగిరాలు తిప్పే మణికట్టు మాంత్రికులు ఉపఖండపు దేశాల నుంచే వస్తుంటారు.
ఆస్ట్రేలియా అంటే ఫాస్ట్ బౌలర్లకే కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది… స్పిన్నర్లుగా రాణించేవారు ఆసీస్ నుంచి తక్కువగానే ఉంటారు. బంతిని గింగిరాలు తిప్పే మణికట్టు మాంత్రికులు ఉపఖండపు దేశాల నుంచే వస్తుంటారు. అయితే ఫాస్ట్ బౌలర్లకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డ నుంచి ప్రపంచ క్రికెట్ ను శాసించే స్పిన్నర్ వచ్చి కింగ్ ఆఫ్ స్పిన్ గా పిలవబడ్డాడంటే అంతకంటే గొప్ప ఘనత మరేముంటుంది. అతను మరెవరో కాదు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్… రెండు దశాబ్దాలకు పైగా ప్రత్యర్థి బ్యాటర్లకు కంగారు పుట్టించిన ఆటగాడు. అసలు స్పిన్ ఆనవాలు కూడా లేపి పిచ్ లపై బంతిని బొంగరంలా తిప్పిన మొనగాడు.
షేన్ వార్న్ గొప్పతనాన్ని అంచనా వేసేందుకు 700 పైగా వికెట్లు ఒక గణాంకం మాత్రమే… ఎందుకంటే స్పిన్నర్ గా అతని నైపుణ్యాన్ని ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. దాదాపు 12 ఏళ్ళ పాటు వార్న్ స్పిన్ ను ఇంగ్లాండ్ అర్థం చేసుకోలేకపోయిందంటే ఇంకా అతని బౌలింగ్ గురించి ఏం చెప్పాలి. నిజానికి కెరీర్ ఆరంభంలోనే వార్న్ ఏం మ్యాజిక్ చేయలేదు. అత్యంత పేలవంగా తన కెరీర్ ను ప్రారంభించాడు. అయితే వార్న్ స్పిన్ మాయ యాషెస్ సిరీస్ తోనే ప్రపంచానికి తెలిసింది. వార్న్ దెబ్బతో 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ యాషెస్ అందుకోలేకపోయింది. చివరకు 2005లో సాధించినా ఆ సిరీస్‌లోనూ 40 వికెట్లతో వార్న్ పైచేయి సాధించాడంటే అతని సత్తా ఏంటో అర్థమవుతుంది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్… ఇలా ప్రతీ జట్టుపై ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయాల్లో అతను కీలకపాత్ర పోషించాడు.
షేన్ వార్న్ వల్లే వరల్డ్ క్రికెట్ లో కంగారూల ఆధిపత్యం సుధీర్ఘంగా కొనసాగింది. వార్న్ స్పిన్ మ్యాజిక్ తోనే ప్రపంచకప్ కంగారూల చెంత చేరింది. ఒకటా రెండా… లెక్క లేనన్ని అసాధారణ రికార్డులను వార్న్ అలవోకగా సాధించాడు. వార్న్ కెరీర్ లో అతిపెద్ద సంచలనం 1993లో యాషెస్ సిరీస్ తొలి టెస్టులో మైక్ గ్యాటింక్ వికెట్ అని చెప్పాలి. బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయిన ఈ వికెట్ వార్న్ స్పిన్ మాయకు ఒక ఎగ్జాంపుల్…. ఎక్కడో లెగ్‌స్టంప్ బయట పడిన బంతి ఏకంగా రెండు అడుగులు స్పిన్ అయి ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను తాకింది. ఏం జరిగిందో క్రీజులో ఉన్న గాటింగ్ కూ, అంపైర్ కూ, ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురి చేసిన ఈ బంతి బాల్ ఆఫ్ సెంచరీగా నిలిచి వార్న్ ఘన ప్రస్థానానికి తెరతీసింది. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని దాటిన తొలి బౌలర్‌గా నిలిచిన వార్న్… సొంతగడ్డపై యాషెస్‌లో ఇంగ్లండ్‌ను 5–0తో చిత్తు చేసిన అనంతరం 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌కు సగర్వంగా వీడ్కోలు పలికాడు. అత్యుత్తమ స్పిన్నర్ గా ప్రపంచ క్రికెట్ లో షేన్ వార్న్ ది ఎప్పటికీ ప్రత్యేకమైన ముద్రగా నిలిచింది.