వేలంలో అమ్ముడుపోలే, ఇప్పుడు ఇరగదీస్తున్నాడు

ఐపిఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని శార్దూల్ ఠాకూర్.. అనూహ్యంగా లక్నో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మెహ్సిన్ ఖాన్ గాయపడి జట్టు నుంచి తప్పుకోవడం వల్ల శార్దూల్ కు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవకాశం వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2025 | 02:55 PMLast Updated on: Mar 28, 2025 | 2:55 PM

Shardul Thakur Who Was Disappointed That He Would Not Be Able To Play In The Ipl Got Lucky

ఐపిఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని శార్దూల్ ఠాకూర్.. అనూహ్యంగా లక్నో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మెహ్సిన్ ఖాన్ గాయపడి జట్టు నుంచి తప్పుకోవడం వల్ల శార్దూల్ కు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్న ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. మొన్న ఢిల్లీతో మ్యాచ్ లో సత్తా చాటిన శార్ధూల్ తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచులోనూ చెలరేగిపోయాడు. ఆ జట్టుకు ఆరంభంలోనే షాకిచ్చాడు. హైదరాబాద్ జట్టు 15 పరుగులకే.. 2.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయేలా చేశాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. కీలక బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లను ఔట్ చేసి సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడు.

మొత్తంగా ఈ మ్యాచు​లో తన 4 ఓవర్ల స్పెల్​లో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా ప్రస్తుత సీజన్ లో లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో 2 ఓవర్లు వేసిన అతడు.. 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలా వరుసగా రెండు మ్యాచుల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025కి ముందు వరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్. తన బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నోసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన జట్టును గెలిపించాడు.. ఈ ప్లేయర్. అయితే గాయాలు, ఫిట్‌నెస్‌ సహా ఇతర కారణాలతో అతడు కొన్ని రోజులుగా భారత జట్టుకు దూరమయ్యాడు. అనూహ్యంగా ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతడిని నిరాశే ఎదురైంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దూల్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా తీసుకోలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలాడు.

ఇక ఈసారి ఐపీఎల్‌లో ఆడలేనని నిరాశలో ఉన్న శార్దూల్‌ ఠాకూర్‌కు అదృష్టం కలిసొచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్‌ మోహ్సిన్ ఖాన్.. గాయంతో టోర్నీ మొత్తానికి దూరమవడంతో అతడికి పిలుపు వచ్చింది. దీంతో వెంటనే బ్యాగ్ సర్దుకుని అతడు లక్నో సూపర్ జెయింట్‌ టీమ్‌లో చేరిపోయాడు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లలో తన అనుభవాన్ని రంగరించి.. బ్యాటర్లకు సవాల్ విసిరే బంతులు సంధించాడు. ఇది గమనించిన లక్నో యాజమాన్యం, కెప్టెన్, కోచ్‌.. ఏకంగా అతడికి తుది జట్టులో చోటు కల్పించారు. అంతేకాదు బౌలింగ్‌ ఎటాక్‌ను తనతోనే ప్రారంభించేలా చేశారు.టీమ్‌ నమ్మకాన్ని నిలబెడుతూ.. శార్దూల్ ఠాకూర్ సత్తాచాటుతున్నాడు. లక్నోతో మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు సన్‌రైజర్స్ బ్యాటర్లు.. 300లకు పైగా స్కోరు చేయడం ఖాయమని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లకు శార్దూల్‌ కళ్లెం వేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని వ్యక్తి.. అత్యధిక వికెట్లు తీసి.. పర్పుల్ క్యాప్‌ రేసులో ముందంజలో ఉన్నాడు. శార్దూల్‌.. 2 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. దీంతో పర్బుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.