అతనిపై వేటు తప్పదా ? చెన్నైపై సన్ రైజర్స్ తుది జట్టు ఇదే
వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు రెడీ అయింది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది.

వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు రెడీ అయింది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో ప్లేస్ ఉండగా.. మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ గెలవడమే కాదు రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటేనే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. ఘోర పరాజయాలతో చతికల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లపైనే జట్టు మొత్తం ఆధారపడి ఉంది. ఈ ఇద్దరూ ఆడితేనే విజయం లేదంటే ఓటమి అన్నట్లుగా తయారైంది ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి. ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి ఘోర వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు తేలిపోతున్నారు. ముంబైతో మ్యాచ్‌కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీని పక్కన పెట్టారు. రూ. 10 కోట్లు పెట్టి కొన్న ఆటగాడిని పక్కన పెట్టారంటేనే షమీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. షమీ స్థానంలో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కత్ తేలిపోయాడు.
చెన్నైలోని చెపాక్ మైదానం స్లో వికెట్. పేసర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ వికెట్‌పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతారు. ఈ క్రమంలోనే షమీని మళ్లీ తుది జట్టులోకి తీసుకోవచ్చు. అదే జరిగితే జయదేవ్ ఉనాద్కత్‌పై వేటు పడనుంది. మరోవైపు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో అభినవ్ మనోహర్‌ను తీసుకొని.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించవచ్చు. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి మ్యాచ్ సెంచరీ మినహా అతను ఒక్క ఇన్నింగ్స్‌లోనూ రాణించలేదు. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్మరన్ రవిచంద్రన్‌ను ఆడించే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఆడనుండగా.. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్ చెలరేగితేనే సన్ రైజర్స్ కు గెలుపుపై ఆశలుంటాయి. అదే సమయంలో బౌలర్లు కూడా రాణించాల్సిందే. లేదంటే మరో పరాజయం తప్పదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడి రెండేసి విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు అట్టడుగు స్థానంలో నిలవనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.