నెంబర్ 4లో నెంబర్ 1 దుమ్ము రేపుతున్న శ్రేయాస్

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో టీమిండియా మరో రెండు విజయాలను అందుకోవాల్సి ఉంది.. ఇప్పటి వరకూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ కు ఇక కంగారూల నుంచి సవాల్ ఎదురుకాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2025 | 02:30 PMLast Updated on: Mar 04, 2025 | 2:30 PM

Shreyas Is Dusting No 1 In No 4

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో టీమిండియా మరో రెండు విజయాలను అందుకోవాల్సి ఉంది.. ఇప్పటి వరకూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ కు ఇక కంగారూల నుంచి సవాల్ ఎదురుకాబోతోంది. ఇదిలా ఉంటే భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శ్రేయాస్ అయ్యర్ పై ప్రశంసల కురుస్తోంది. శ్రేయస్ అయ్యర్ తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లీ గాయపడడంతో జట్టులోకి వచ్చిన శ్రేయాన్ వెనుదిరిగి చూసుకోలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లోనూ కష్టాల్లోకి వెళ్లిన తన జట్టును కాపాడుకున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లో క్రీజలోకి వచ్చిన అతడు ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 98 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 79 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో తాను బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ అని మరోసారి నిరూపించాడు.

ఇప్పుడే కాదు గతంలో న్యూజిలాండ్ పై అయ్యర్ కు మంచి రికార్డ్ ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లోనూ న్యూజిలాండ్ పై శ్రేయస్ సెంచరీ సాధించాడు. ఆ మెగాటోర్నీలో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు, రెండు శతకాలు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే ఈ మిడిలార్డర్ బ్యాటర్ న్యూజిలాండ్ పై 8 వన్డేల్లో 70.37 సగటుతో 563 పరుగులు చేశాడు. నెంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ప్రతీసారి నిలకడగా రాణిస్తున్నాడు అయ్యర్. అలా ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ నెం.4లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అయ్యర్.. నెం.4 స్థానంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ స్థానంలో విరాట్ 15 సార్లు హాఫ్ సెంచరీలు చేస్తే.. అయ్యర్ 16 సార్లు బాదాడు. తద్వారా జోరూట్, బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రాస్ టేలర్ 65 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే గత ఏడాది జాతీయ జట్టులో చోటు కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపాడు. నిలకడగా రాణించి మళ్ళీ సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. అంతేకాదు నాలుగో స్థానంలో తాను పర్ఫెక్ట్ బ్యాటర్ అని నిరూపించుకున్నాడు. ఐసీసీ టోర్నమెంట్స్ లోనూ శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ ఈవెంట్స్లో అతడు మొత్తం 14 ఇన్నింగ్స్ లో 61.81 యావరేజ్ తో 680 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఎనిమిది ఇన్నింగ్స్ లో 78.85 సగటు, 111.3 స్ట్రైక్ రేట్ తో 552 పరుగులు చేశాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆసీస్ తో జరిగే సెమీఫైనల్లోనూ అతనే కీలకం కానున్నాడని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వన్డే ఫార్మాట్ లో మిడిలార్డర్ లో పార్టనర్ షిప్ లు కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.