శ్రేయాస్ అయ్యర్ కు ఐసీసీ అవార్డ్, ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపిక
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చి నెలకి గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన జాకబ్ డఫీ,

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చి నెలకి గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి శ్రేయస్ అయ్యర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ లో కూడా అదరగొడుతున్నాడు. మార్చిలో జరిగిన మూడు మ్యాచ్ ల్లో శ్రేయస్ అయ్యర్ 57.33 సగటుతో, 77.47 మోస్తరు స్ట్రైక్ రేట్ తో 172 పరుగులు చేశాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రచిన్ రవీంద్ర కంటే కేవలం 20 పరుగులు వెనుకబడి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 79 పరుగులు చేసిన శ్రేయస్.. సెమీస్‌లో ఆసీస్‌పై 45, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ మిడిలార్డర్‌లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి. భారత క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్ తరఫున గిల్ అత్యధికంగా మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు. ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున శ్రేయస్ అయ్యర్ 243 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్, పాకిస్థాన్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.