నన్ను తీసేయడమే మంచిదైంది శ్రేయాస్ అయ్యర్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కు ఎంతో పోటీ ఉంటుంది... ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్ళు సత్తా చాటుతూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కు ఎంతో పోటీ ఉంటుంది… ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్ళు సత్తా చాటుతూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో ప్రతీ ప్లేస్ కూ కనీసం నలుగురైదుగురు పోటీపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిలకడగా రాణస్తేనే జట్టులో ప్లేస్ ఉంటుంది.. లేకుంటే గల్లంతే.. సరిగ్గా ఏడాది క్రితం ఇలాంటి పరిస్థితితోనే శ్రేయాస్ అయ్యర్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు. కానీ మళ్ళీ దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో మెరుపులు మెరిపించిన అయ్యర్ తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు. ఈ సందర్భంగా అతను చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. జట్టులో నుంచి తనను తీసేయడమే మంచిదైందని వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా ఆడి పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సక్సెస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.
దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు మధ్యలో దొరికిన విరామంలో తన టెక్నిక్‌పై ఫోకస్ పెట్టానని, ముఖ్యంగా డ్రాప్-ఇన్ షాట్స్‌తో సింగిల్స్ తీయడం నేర్చుకున్నానని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.ప్రతీ బంతి కట్, ఫుల్ షాట్స్ ఆడకుండా.. స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని చెప్పాడు. ముఖ్యంగా శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగిల్స్‌గా మల్చడం సంతృప్తినిచ్చిందని చెప్పాడు. తొలి వన్డేలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ధాటిగా ఆడాలనుకున్నట్టు చెప్పాడు. రెండో వన్డేలో మ్యాచ్‌ను ముగించాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. చివరి మ్యాచ్‌లో గిల్, కోహ్లీ అద్భుతమైన పునాది వేశారని, అది తనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు.
ప్రస్తుతం వరుస విజయాలతో డ్రెస్సింగ్ రూమ్ అంతా మంచి జోష్‌లో ఉందన్నాడు. జట్టులో ప్రతీ ఆటగాడు సూపర్ ఫామ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ లో ప్రతీ ఆటగాడు ఎలా బాధ్యత తీసుకున్నారో అందరూ చూశారన్నాడు. కీలకమైన పరుగులు చేయడం.. వికెట్లు తీయడం చాలా ముఖ్యమనీ, అదే ఇంగ్లాండ్ పై సిరీస్ లో కనిపించిందన్నాడు. సిరీస్ లో జట్టుగా రాణించామని, ఛాంపియన్స్ ట్రోఫీలో మరింత మెరుగ్గా సత్తా చాటుతామన్న నమ్మకం ఉందన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మోకాలి గాయం కారణంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో నెంబర్ 4 స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తొలి వన్డేలో 59 పరుగులు చేసిన అయ్యర్.. రెండో వన్డేలో 44 పరుగులు.. మూడో వన్డేలో 78 పరుగులు చేశాడు.