Cricket: శివాలెత్తనున్న సిరాజ్ విరాట్ ఐదో గేర్ ఆట
విరాట్ కొహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మాక్స్ వెల్, దినేష్ కార్తీక్, మహమ్మద్ సిరాజ్, వానిందు హాసరంగా, వైనీ పార్నెల్, డేవిడ్ విల్లే.. ఒక అంతర్జాతీయ జట్టుకు ఏ మాత్రం తీసిపోని లైనప్ బెంగళూరు సొంతం. అయినప్పటికీ, కన్నడీగుల కల మాత్రం నెరవేరట్లేదు. ప్రతి ఐ పి ఎల్ సీజన్ కు ముందు, పర్ఫెక్ట్ గా కనిపించే జట్లలో బెంగళూరు ఒకటి.
ఈ సీజన్ లో కూడా అలాగే బరిలోకి దిగిన చాలెంజర్స్ జట్టు, తాను ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్కటే గెలిచి, విధికి ఎదురీదుతోంది. రాయల్ చాలెంజర్స్ మొదటి మ్యాచులో ముంబై ఇండియన్స్ తో తలపడగా, ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ లు తమ బ్యాటింగ్ తో పరుగుల దుమారం లేపారు. 172 పరుగుల ఛేజింగ్ ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచులో కలకత్తాతో జరిగిన మ్యాచులో తిరిగి 81 పరుగుల తేడాతో ఓడిపోయి పాత కథను రిపీట్ చేసింది.
ఇక మళ్ళీ ట్రాక్ లో పడ్డ బెంగళూరు జట్టు, 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఏకంగా 212 పరుగులు చేయగలిగింది. ఇదంతా కేవలం బ్యాటింగ్ కు సంబంధించిన డిటైలింగ్ మాత్రమే. ఒక మ్యాచులో దండయాత్ర చేసినట్టుగా ఆడుతూ, మరో మ్యాచులో తీర్థయాత్ర కు వెళ్తున్నట్టు క్యూ కడుతూ, అభిమానుల్ని పూర్తిగా కన్ఫ్యుస్ చేస్తున్నారు. ఇక నేడు ఢిల్లీతో జరగబోయే మ్యాచులో, బెంగళూరు ఆటగాళ్లు ఏ విధంగా రాణిస్తారో అని ఐ పి ఎల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విరాట్, డుప్లెసిస్, మాక్స్ వెల్ తో పాటు, లోయర్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్ వంటి ప్లేయర్లు బ్యాట్ ఘలిపిస్తే, బెంగళూరు విక్టరీ ట్రాక్ ఎక్కడం పెద్ద పనేం కాదు. ఢిల్లీ ఆడిన ఏ మ్యాచులో కూడా 160 కి తక్కువగా పరుగులిచ్చింది లేదు. బెంగళూరు వంటి పటిష్ట జట్టు, ఢిల్లీపై 200 స్కోర్ చేసిన ఆశ్చర్యం లేదు.