కమ్ బ్యాక్ అదిరిందిగా, పర్పుల్ క్యాప్ రేసులో సిరాజ్
ఐపీఎల్ 18వ సీజన్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. పేలవ ఫామ్ తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్ ఇప్పుడు ఐపీఎల్ తో మళ్ళీ లైన్ అండ్ లెంగ్త్ అందుకున్నాడు.

ఐపీఎల్ 18వ సీజన్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. పేలవ ఫామ్ తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్ ఇప్పుడు ఐపీఎల్ తో మళ్ళీ లైన్ అండ్ లెంగ్త్ అందుకున్నాడు. ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా… తర్వాత మాత్రం ఫామ్ లోకి వచ్చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదన్న కసితో రగిలిపోతున్న సిరాజ్ ఐపీఎల్ లో అదరగొట్టేస్తున్నాడు. గత ఏడాది ఆర్సీబీ వేలంలోకి వదిలేయడంతో గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో మంచి రికార్డే ఉండడంతో సహజంగానే మియా భాయ్ పై అంచనాలు బాగానే ఉంటాయి. అవి అందుకోవడం అంత ఈజీ కాదని కూడా తెలుసు..ఎందుకంటే ఐపీఎల్ ఎక్కువగా బ్యాటర్ల గేమ్ గానే ఉంటోంది. అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే తప్ప మెగా లీగ్ లో తనదైన ముద్ర వేయడం కష్టం.. కానీ ఈ సారి సిరాజ్ పట్టుదలతో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. ముఖ్యంగా పవన్ ప్లేలోనే ప్రత్యర్థి జట్ల వికెట్లు తీస్తూ గుజరాత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో 54 పరుగులు సమర్పించుకున్న సిరాజ్ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లలో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ పై 2 , ఆర్సీబీపై 3 వికెట్లు తీసిన సిరాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 17 పరుగులకు 4 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను గట్టిదెబ్బ కొట్టాడు. తన పేస్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన వందో ఐపీఎల్ వికెట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్‌గా సిరాజ్ మియా రికార్డులకెక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు దూరమవడం సిరాజ్ ను షాక్ కు గురిచేసిందని అతని మాటల్లోనే అర్థమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి తనను సెలెక్ట్ చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని ఇప్పటికే పలుసార్లు సిరాజ్ చెప్పాడు. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా ఫిట్‌నెస్, ఆట.. రెండింటిపైనా ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చాడు. తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకున్నాననీ, ఇప్పుడు తన బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ తో మళ్ళీ ఫామ్ లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సీజన్‌లో సిరాజ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ మూడో స్ధానంలో ఉన్నాడు. నూర్ అహ్మద్ 11 వికెట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా..సాయికిషోర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.