ఇలా అయితే కష్టమే రంజీల్లోనూ సిరాజ్ ఫ్లాప్ షో
టీమిండియా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ రంజీల్లో ఆకట్టుకోలేకపోయారు. జాతీయ జట్టులో పేలవ ఫామ్ తో సతమతమైన వారంతా దేశవాళీ క్రికెట్ లోనూ గాడిన పడలేదు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ రంజీల్లో ఆకట్టుకోలేకపోయారు. జాతీయ జట్టులో పేలవ ఫామ్ తో సతమతమైన వారంతా దేశవాళీ క్రికెట్ లోనూ గాడిన పడలేదు. రోహిత్ , పంత్ , జైశ్వాల్ , కోహ్లీ వంటి బ్యాటర్లతో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయిన సిరాజ్ ను సెలక్టర్లు వైట్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పించారు. ఇంగ్లాండ్ తో సిరీస్ లకే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం పక్కన పెట్టారు. దీంతో రంజీ బరిలోకి దిగిన సిరాజ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఒకప్పటి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డాడు. హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన అతడు.. తాజాగా విదర్భతో జరుగుతోన్న మ్యాచ్ లో గొప్పగా ప్రదర్శన చేయలేకపోయాడు.18 ఓవర్లు వేసి 47 పరుగులిచ్చిన సిరాజ్ ఒకే ఒక వికెట్ తీశాడు.
భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సిరాజ్ అతి సాధారణ బౌలర్‌లా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మ్యాజిక్ చేసే సిరాజ్ ఈ మ్యాచ్‌లో తన తొలి 15 ఓవరల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతనికి దక్కిన ఏకైక వికెట్ చివరి స్పెల్‌లో లభించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ పేసర్లకు సహకరించలేదా అంటే అదేమీ లేదు. సిరాజ్ సహచర పేసర్లు చింట్ల రక్షన్ రెడ్డి, చామ మిలింద్ కలిపి ఐదు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రాణించకపోయినా మిగతా బౌలర్లు రాణించి విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేశారు. రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. చామ మిలింద్ రెండు, తనయ్ త్యాగరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నారు
వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్ కు ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో చోటు దక్కలేదు. సిరాజ్ పాత బంతితో ప్రభావం చూపలేకపోతున్నడంటూ పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో పాత బంతితో ప్రాక్టీస్ చేసిన సిరాజ్.. ఇప్పుడు రంజీ ట్రోఫీలో తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడని అభిప్రాయపడుతున్నారు. పొదుపుగానే బౌలింగ్ చేసినా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేలా అతని బౌలింగ్ లేదు. ఇలాగే బౌలింగ్ చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే పలువురు యువ పేసర్లు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సీజన్ లోనైనా సిరాజ్ అదరగొట్టాలని హైదరాబాదీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.