సిరాజ్ దెబ్బ… సన్ రైజర్స్ అబ్బా.. హోం టీమ్ నే దెబ్బకొట్టాడుగా

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెత్త బ్యాటింగ్ తో , అంతకంటే చెత్త బౌలింగ్ తో వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 01:00 PMLast Updated on: Apr 07, 2025 | 1:00 PM

Sirajs Blow Sunrisers Oh My Hes Just Beating The Home Team

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెత్త బ్యాటింగ్ తో , అంతకంటే చెత్త బౌలింగ్ తో వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లోహైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సన్ రైజర్స్ ను దెబ్బతీసాడు. ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో సిరాజ్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు.అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ ఔట్ చేశాడు. ఓవరాల్‌గా సిరాజ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

మొదట ముంబైపై, ఆ తర్వాత ఆర్‌సీబీపై, ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సిరాజ్ తన మ్యాజిక్‌ను చూపించాడు. పవర్ ప్లేలో సిరాజ్ తన సూపర్ బౌలింగ్‌తో హైదరాబాద్ జట్టుకు బిగ్ షాకిచ్చాడు.ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు సిరాజ్. 2 బౌండరీలు కొట్టిన స్టార్ బ్యాటర్.. మియాపై పైచేయి సాధించినట్లే కనిపించాడు. కానీ మంచి బంతితో అతడి పనిపట్టాడు సిరాజ్. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు మీద ఉన్న అభిషేక్ శర్మను వెనక్కి పంపించాడు. ఇలా ఆదిలోనే ఆరెంజ్ ఆర్మీ జోరుకు బ్రేకులు వేశాడు. లోకల్ బాయ్ క్వాలిటీ పేస్‌, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడని మెచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన వందో ఐపీఎల్ వికెట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్‌గా సిరాజ్ మియా రికార్డులకెక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో సిరాజ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ రెండో స్ధానంలో ఉన్నాడు. 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ సిరాజ్‌ను, మెగా వేలంలో ఆ జట్టు వదిలేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ.12.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్, మొదటి మ్యాచ్‌లో పంజాబ్‌పై వికెట్లు తీయలేకపోయాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తన మాజీ జట్టు ఆర్సీబీపై నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో మళ్లీ నాలుగు వికెట్లు తీసి తన స్థాయిని మరోసారి నిరూపించాడు. మొత్తంగా ఈ నాలుగు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.కాగా ఐపీఎల్ 2022 నుంచి పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు.