Tagnarine Chanderpal: టీమిండియా మీద ఆడు.. అప్పుడే నీకు పేరు
అంతర్జాతీయ క్రికెట్‌లో కొందరు బ్యాట్స్‌బ్యాన్ కొన్ని జట్లపై రెచ్చిపోయి ఆడుతుంటారు. ఉదాహరణకు వీవీఎస్ లక్ష్మణ్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియాపై.. అలాగే స్టీవ్ స్మిత్ లాంటి మరికొందరు ఆటగాళ్లు ఇంగ్లాండ్, భారత్‌పై విజృంభించి ఆడతారు.
భారత సంతతికి చెందిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ శివనారాయన్ చందర్‌పాల్ కూడా ఇదే తరహా ఆటగాడు. భారత సంతతికి చెందిన ఈ ఆటగాడు టీమిండియా బౌలర్లు అంటే పిచ్చేక్కిపోతాడు. అయితే ఇప్పుడు విండీస్ తరఫున టీమిండియా బౌలర్లపైకి శివనారాయణ్ స్థానంలో అతని కొడుకు టగ్నరైన్ చందర్‌పాల్ దిగుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో జూలై 12 నుంచి టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ మేరకు ముందుగానే వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ 18 మంది ఆటగాళ్లను ప్రాక్టీస్ క్యాంప్ కోసం ఎంపిక చేసింది. ఇందులో శివనారాయణ్ కుమారుడైన టాగెనరైన్ కూడా ఉండడం గమనార్హం.
తండ్రి బాటలోనే నడిచేందుకు సిద్ధమైన టగ్నరైన్ .. వెస్టిండీస్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి ఇప్పటివరకు 6 టెస్టులు ఆడాడు. ఆ 6 టెస్టుల్లో 11 ఇన్నింగ్స్ ఆడిన అతను 207 టాప్ స్కోర్‌తో సహా మొత్తం 453 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీతో పాటు 45.30 బ్యాటింగ్ యావరేజ్ కూడా ఉంది. తన తండ్రి లాగానే సుదీర్ఘకాలం క్రీజులో నిలబడగల సామర్ధ్యం కలిగి ఉండడం విశేషం. కాగా, ఈ యువ ఆటగాడి ఆటతీరు చూస్తే 18 మంది ప్రాక్టీస్ క్యాంప్‌లో నుంచి అసలు జట్టులోకి వచ్చే ఆటగాళ్లలో టగ్నరైన్ కూడా ఉంటాడనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్లేయింగ్-11లో అతడి స్థానం కూడా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
శివనారాయణ్ చందర్‌పాల్ టీమిండియాపై మొత్తం 25 టెస్టులు ఆడి 63.85 సగటుతో 2171 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే భారత్‌పై అతను ఆడిన 46 వన్డే మ్యాచ్‌ల్లో 35.64 బ్యాటింగ్ యావరేజ్‌తో మొత్తం 1319 పరుగులు చేశాడు. ఇందులో కూడా 2సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో తండ్రి లాగానే కొడుకు కూడా టీమిండియాపై చెలరేగి ఆడతాడేమోనన్న అంచనాలు కొనసాగుతున్నాయి.