స్మిత్ బాదుడే బాదుడు.. టెస్టుల్లో రికార్డుల మోత
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెడ్ బాల్ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. ఇటీవలే 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్ తాజాగా శ్రీలంక టూర్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెడ్ బాల్ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. ఇటీవలే 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్ తాజాగా శ్రీలంక టూర్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి నిలిచాడు. ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో స్మిత్ ఫామ్ లోకి వచ్చాడు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ లంక గడ్డపైనా పరుగుల వరద పారిస్తున్నాడు. భారత్‌తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్‌బోర్న్‌లో భారీ శతకంతో చెలరేగాడు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో తొలి టెస్టులోనూ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్‌లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్‌లో కూడా చేరాడు.
తాజాగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ రెండో రోజు ఆటలో శతకంతో నాటౌట్ గా నిలిచాడు. స్మిత్ ఇన్నింగ్స్ లో 9ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఆసీస్ బ్యాటర్ కు టెస్ట్ కెరీర్ లో ఇది 36వ శతకం. తొలి టెస్టులో 35వ సెంచరీతో దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్, జయవర్ధనేలను వెనక్కి నెట్టిన స్మిత్.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ద్రవిడ్, ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ 36 టెస్ట్ సెంచరీల రికార్డ్ సమం చేశాడు. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో ద్రవిడ్, రూట్ లతో కలిసి 5వ స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో 51 సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ ఉన్నాడు. ప్రస్తుత టెస్ట్ క్రికెట్ లో రూట్ తో సమంగా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా స్మిత్ కొనసాగుతున్నాడు.
చివరి 5 టెస్టుల్లో స్మిత్ కు ఇది నాలుగో సెంచరీ. 116 టెస్టుల్లోనే స్మిత్ తన 36 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ పై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇదిలా ఉంటే స్మిత్ పాంటింగ్ పరుగుల రికార్డును కాకుండా.. అతని క్యాచ్ ల రికార్డ్ బద్దలు కొట్టాడు. ఫీల్డర్ గా టెస్ట్ క్రికెట్ లో పాంటింగ్ అత్యధిక క్యాచ్ ల రికార్డ్ బ్రేక్ చేసి టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు. 116 టెస్టుల్లో 197 క్యాచ్ లు పట్టి పాంటింగ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా ఈ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 210 క్యాచ్ లతో అగ్ర స్థానంలో ఉన్నాడు.