తిప్పేయాల్సిందే పుణేలో స్పిన్ పిచ్
న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టుకు రెడీ అవుతోంది. గురువారం నుంచి పుణే వేదికగా భారత్, కివీస్ రెండో టెస్ట్ మొదలుకానుంది. సిరీస్ లో 0-1తో వెనుకబడిన రోహిత్ సేన రెండో టెస్ట్ గెలిచి సమం చేయాలని పట్టుదలగా ఉంది.
న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టుకు రెడీ అవుతోంది. గురువారం నుంచి పుణే వేదికగా భారత్, కివీస్ రెండో టెస్ట్ మొదలుకానుంది. సిరీస్ లో 0-1తో వెనుకబడిన రోహిత్ సేన రెండో టెస్ట్ గెలిచి సమం చేయాలని పట్టుదలగా ఉంది. కివీస్ పేసర్ల ధాటికి బెంగళూరులో 46 పరుగులకే కుప్పకూలిన భారత్ ఇప్పుడు పుణేలో దెబ్బకు దెబ్బతీయాలని ఎదురుచూస్తోంది. స్పిన్ తోనే న్యూజిలాండ్ కు చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం పుణేలో పూర్తి టర్నింగ్ పిచ్ ను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే క్యూరేటర్ కు టీమిండియా మేనేజ్ మెంట్ సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ లలో హోంటీమ్ సూచనలతోనే పిచ్ ఉంటుంది. ఉపఖండపు దేశాల్లో స్పిన్ పిచ్ లు ఉండడం కామన్. ఇప్పుడు సిరీస్ సమం చేయాలంటే ఖచ్చితంగా తమ స్పిన్ అస్త్రంతోనే బరిలోకి దిగాలని టీమిండియా డిసైడయింది.
పుణే ఎంసీఎ స్టేడియంలో నల్లమట్టి పిచ్ సిద్ధమవుతోంది. ఈ పిచ్ పై బౌన్స్ తక్కువగా ఉండి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. స్లో బౌలర్లను ఇలాంటి పిచ్ లపై ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాలే. బెంగళూరు పిచ్ మొదటి మూడు రోజులు పేసర్లకు అనుకూలించడం దెబ్బకొట్టింది. పైగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మరో తప్పిదంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పుణే టెస్టులో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని పట్టుదలగా ఉన్న రోహిత్ సేన స్పిన్ ఎటాక్ తోనే బరిలోకి దిగబోతోంది. ఈ టెస్టులో నలుగురు స్పిన్నర్లతో భారత తుది జట్టు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నది కొందరి అభిప్రాయం. అందుకే వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి అదనంగా తీసుకున్నారని భావిస్తున్నారు. దీంతో జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ లతో పాటు వాషింగ్టన్ సుందర్ నూ ఆడించే అవకాశముంది. అప్పుడు ఒక పేసర్ తోనే బరిలోకి దిగుతారా, మరొక బ్యాటర్ ను తప్పిస్తారా అనేది చూడాలి.
మరోవైపు పుణేతో పాటు చివరి టెస్టుకు ఆతిథ్యమిచ్చే వాంఖేడేలోనూ స్పిన్నర్లదే పైచేయిగా ఉండబోతోంది. సహజంగానే ముంబై పిచ్ పై స్పిన్నర్లు డామినేట్ చేస్తుంటారు. ఇప్పుడు భారత్ కు సిరీస్ విజయం తప్పనిసరిగా కావాలంటే స్పిన్ వ్యూహంతోనే కివీస్ ను నిలువరించాలి. ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ సిరీస్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరో ఏడు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న టీమిండియా కనీసం నాలుగు గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. వీటిలో రెండు కివీస్ తోనే ఆడనుండగా… మిగిలిన ఐదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ తో తలపడాల్సి ఉంది. బెంగళూరు టెస్ట్ ఓటమితో టాప్ ప్లేస్ లోనూ కొనసాగుతున్నప్పటికీ భారత్ గెలుపు శాతం తగ్గిపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్ అనూహ్యంగా మూడు స్థానాలు మెరుగై నాలుగో స్థానానికి దూసుకొచ్చింది.