Maheesh Theekshana: ఆదివారం ఫైనల్స్‌లో మిస్టరీ స్పిన్నర్ లేనట్టే..!
పాక్‌తో మ్యాచులో గాయపడిన స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఆసియా కప్ ఫైనల్‌లో ఆడే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో.. అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది.

Maheesh Theekshana: ఉత్కంఠ పోరులో పాక్‌పై అనూహ్య విజయంతో శ్రీలంక మరోసారి ఆసియా కప్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్‌తో మ్యాచులో గాయపడిన స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఆసియా కప్ ఫైనల్‌లో ఆడే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో.. అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. స్కానింగ్ కోసం నేడు తీక్షణ ఆస్పత్రికి వెళ్లనున్నాడు.
గురువారం పాక్‌తో జరిగిన మ్యాచులో యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణకు గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి కుడి తొడ కండరాలు పట్టేశాయి. గాయం అయినా కీలక మ్యాచ్ కాబట్టి అతడు బౌలింగ్ చేశాడు. 9 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబోలోని ప్రేమదాస మైదానంలోనే ఆదివారం టీమిండియాతో ఫైనల్లో శ్రీలంక తలపడనుంది. ఈ సమయంలో కీలక స్పిన్నర్ అయిన తీక్షణ గాయపడటం లంక జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది.