Wanindu Hasaranga: హసరంగా రిటైర్మెంట్.. ఆందోళనలో ఆర్సీబీ

తాజాగా శ్రీలంక పరిమిత ఓవర్ల టాప్ బౌలర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వానిందు హసరంగా టెస్టు క్రికెట్‌కి గుడ్ బై చెప్పడం కూడా షాక్‌కు గురి చేస్తోంది. హసరంగా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2023 | 02:32 PMLast Updated on: Aug 15, 2023 | 2:32 PM

Sri Lankas Spinner Wanindu Hasaranga Retires From Test Cricket

Wanindu Hasaranga: శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా టెస్టు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 26 ఏళ్ళ ఈ స్టార్ స్పిన్నర్ పరిమిత ఓవర్ల క్రికెట్ మీద దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ మోజులో పడి చాలా మంది టెస్టు క్రికెట్‌కి దూరమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టెస్టు క్రికెట్‌ని నిర్లక్ష్యం చేస్తూ, చాలా చిన్న వయసులోనే ఈ ఫార్మాట్‌కి వీడ్కోలు పలకడం చాలా దురదృష్టకరమని క్రికెట్ పండితులు అంటున్నారు.

ఒకానొక దశలో టెస్టు క్రికెట్‌లో చోటు దక్కితే చాలు అనుకునే పరిస్థితి నుంచి.. స్వయంగా వారే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొంటూ తమ క్రికెట్ బోర్డుకి షాకిస్తున్నారు. తాజాగా శ్రీలంక పరిమిత ఓవర్ల టాప్ బౌలర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వానిందు హసరంగా టెస్టు క్రికెట్‌కి గుడ్ బై చెప్పడం కూడా షాక్‌కు గురి చేస్తోంది. హసరంగా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిస్టరీ స్పిన్నర్‌గా అతి తక్కువ కాలంలోనే క్రికెట్‌లో తన ముద్ర వేసాడు. వన్డే, టీ 20 ఫార్మాట్‌లతో పాటు ప్రపంచ లీగుల్లో సత్తా చాటాడు. 20 ఏళ్ళ వయసులో తొలిసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ఈ లెగ్ స్పిన్నర్‌కి 2020లో తొలిసారి దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వన్డే, టీ 20ల్లో అదరగొట్టే హసరంగా.. టెస్టుల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు టెస్టుల్లో 7 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక అప్పటి నుంచి హసరంగాకి టెస్టు జట్టులో చోటు దక్కడం లేదు.

2021లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేసిన 26 ఏళ్ళ హసరంగా.. ఇంత త్వరగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. శ్రీలంక క్రికెట్ సీఈఓ డిసిల్వా మాట్లాడుతూ హసరంగా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పాడు. హసరంగా జట్టుకు వైట్ బాల్ క్రికెట్‌లో చాలా కీలకమైన ఆటగాడు అని తెలియజేశాడు. ఈ నిర్ణయంతో ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు అభిమానులు, ఆందోళన చెందుతున్నారు. హసరంగా కేవలం శ్రీలంకకు మాత్రమే పరిమితం అవుతాడా, లేక ఐపీఎల్ గురించి కూడా ఏదైనా షాక్‌కి గురి చేసే నిర్ణయాన్ని ప్రకటిస్తాడా అని బెంగళూరు జట్టు అభిమానులు ఈగర్‌గా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.