సస్పెన్స్ కు తెరదించిన ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండర్
ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను ఆనౌన్స్ చేసింది.స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.

ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను ఆనౌన్స్ చేసింది.స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. కేఎల్ రాహుల్ అనూహ్యంగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవడంతో కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు.ఓ మేజర్ జట్టుకు అక్షర్ కెప్టెన్ గా ఎంపికవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఏడాది జనవరిలో టీమిండియా టీ20 జట్టుకు అక్షర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన టీం గుజరాత్ కు వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 23 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. రీసెంట్ గా సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలో జట్టును నడిపించాడు.
2019 నుంచి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు అక్షర్ పటేల్ ఆడుతున్నాడు. ఆ టీమ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.వేలానికి ముందు ఢిల్లీ అక్షర్ ను 16.50 కోట్లు చెల్లించి రిటెయిన్ చేసుకుంది.2024 సీజన్ లో అక్షర్ ఓ మ్యాచ్ లో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించడంతో.. డూ ఆర్ డై మ్యాచ్ లో అక్షర్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. కానీ ఆ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఢిల్లీ ప్లేఆఫ్స్ కు దూరమైంది.ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న పంత్ ఆ టీమ్ ను వదిలి వెళ్లిపోయాడు. ఢిల్లీ అతణ్ని రిటైన్ చేసుకోకపోవడంతో కొత్త కెప్టెన్ అవసరం వచ్చింది. గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను వేలంలో ఢిల్లీ తీసుకుంది. దీంతో అతనికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేలా కనిపించింది. కానీ రాహుల్ ఆసక్తి చూపించలేదు. బ్యాటింగ్ పై మరింత ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీనీ వద్దన్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అక్షర్ వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది. ఆరు సీజన్లలో ఆ టీమ్ తరపున 82 మ్యాచ్ లాడిన అక్షర్ ఆ జట్టు సీనియర్ ప్లేయర్. గత సీజన్ లో అక్షర్ 235 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు.
ఇప్పటి వరకు అక్షర్ పటేల్.. టీమిండియా తరఫున 14 టెస్టులు, 68 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. అలానే 150 ఐపీఎల్ మ్యాచుల్లోనూ ఆడాడు. ఐపీఎల్ కెరీర్ లో 1,653 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. 18వ ఐపీఎల్‌లో యువ ఆల్‌రౌండర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించడంతో కప్ అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ వరకూ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2008, 2009 టోర్నీల్లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. గత మూడేళ్లుగా లీగ్ దశలోనే ఇంటిదారి పడుతోంది. ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్ అక్షర్ ఆ జట్టుకు టైటిల్ అందిస్తాడేమో చూడాలి.