Golden Ticket: చీఫ్ గెస్ట్‌లుగా వాళ్ళనూ పిలుద్దాం.. సునీల్ గవాస్కర్ సూచన..!
ఇదివరకే జై షా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌లకు ఈ టికెట్లను అందించాడు. గోల్డెన్ టికెట్ పొందిన సెలబ్రిటీలు ప్రపంచకప్ జరిగినన్ని రోజులూ.. ఏ మ్యాచ్ అయినా ఉచితంగానే వీక్షించొచ్చు.

Golden Ticket: వచ్చే నెల నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌ను సమర్ధవంతంగా నిర్వహించేందుకుగాను ఐసీసీతో కలిసి బీసీసీఐ సన్నాహకాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ సెక్రటరీ జై షా.. వరల్డ్ కప్‌కు ప్రాచుర్యం కల్పించడానికని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకు ‘గోల్డెన్ టికెట్’ అందిస్తున్నాడు. ఇదివరకే జై షా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌లకు ఈ టికెట్లను అందించాడు.
గోల్డెన్ టికెట్ పొందిన సెలబ్రిటీలు ప్రపంచకప్ జరిగినన్ని రోజులూ.. ఏ మ్యాచ్ అయినా ఉచితంగానే వీక్షించొచ్చు. అయితే తాజాగా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐపై ప్రశంసలు కురిపించాడు. ఇది గొప్ప ఆలోచన అని, కానీ టికెట్లను భారత క్రీడారంగంలో ప్రముఖులుగా ఉన్నవారికి కూడా ఇచ్చి వారిని గౌరవించాలని సూచించాడు. భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీలకు గోల్డెన్ టికెట్లు ఇవ్వాలని వెల్లడించాడు. అంతేగాక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్‌కూ అందజేయాలని సన్నీ పేర్కొన్నాడు.
కాగా 1987, 1996, 2011 తర్వాత స్వదేశంలో నాలుగోసారి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్.. ఈ ఏడాది సొంతదేశంలో మరోసారి 2011 మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నది. భారత్ చివరిసారి 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పట్నుంచి పదేండ్లుగా అందకుండా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.