300 అంటే మూతి పగులుద్ది, ముందు మ్యాచ్ గెలవండ్రా
ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్... గత సీజన్ లో రికార్డుల దుమ్ముదులుపుతూ భారీస్కోర్లతో సన్ రైజర్స్ చెలరేగిపోయింది.

ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్… గత సీజన్ లో రికార్డుల దుమ్ముదులుపుతూ భారీస్కోర్లతో సన్ రైజర్స్ చెలరేగిపోయింది. ఆజట్టు బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి జట్ల బౌలర్లు టెన్షన్ తో సతమతమయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 18వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ రికార్డ్ స్కోర్ చేసింది. అత్యధిక స్కోరుకు అడుగు దూరంలో నిలిచి ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇక 300 స్కోరు చేయడమే మిగిలిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ రెండో మ్యాచ్ నుంచి సీన్ రివర్సయింది. 300 స్కోరు పక్కన పెడితే వరుసగా రెండు ఓటములు షాకిచ్చాయి. తొలి మ్యాచ్‌లోనే రికార్డ్ స్కోర్ నమోదు చేయడం.. సన్‌రైజర్స్ టాపార్డర్ భీకరంగా ఉండటంతో ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. సునాయసంగా ఫైనల్ చేరుతుందని భావించారు. 300 స్కోర్ కూడా నమోదు చేస్తుందని ఆశించారు. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్ తగిలింది. 300 దేవుడెరుగు కనీసం 200 పరుగులు చేయలేకపోయింది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగానే జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో చిత్తయ్యింది. ఈ ఓటమి సన్‌రైజర్స్ లుకలుకలను బయటపెట్టింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ బలమంతా టాపార్డర్‌లోనే ఉందనే విషయాన్ని తెలియజేసింది. బౌలింగ్ పేలవమనే విషయం ప్రత్యర్థులకు అర్థమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ తేలిపోయింది. చెత్త బ్యాటింగ్‌తో 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో పాటు చెత్త బౌలింగ్ సన్‌రైజర్స్ కొంపముంచింది. ఈ వరుస పరాజయాలతో సన్‌రైజర్స్ అసలు పరిస్థితి అభిమానులకు తెలుసొచ్చింది. మరోసారి 300 అంటే మూతి పగులుతుందనే విషయం అర్థమైంది. ఇప్పటికైనా సన్‌రైజర్స్.. దూకుడును పక్కనపెట్టి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. బౌలింగ్ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకోవాలని, సీనియర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ప్రతీసారీ బ్యాటింగ్ తోనే గెలవలేమన్నది లక్నోతో ఓటమి తర్వాత హైదరాబాద్ టీమ్ కు అర్థమయ్యే ఉండాలి. అలాగే ఢిల్లీతో మ్యాచ్ లో బ్యాటర్లు కూడా ఫ్లాప్ అయ్యారు. SRH బ్యాటర్లలో ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొదటి మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్ కిషన్.. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మిచెల్ స్టార్క్ దెబ్బకు కేవలం 5 పరుగులకే పెవీలియన్ చేరుకున్నాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో అయినా రాణించారా అంటే.. అదీ లేదు. ఢిల్లీ బ్యాటర్లు SRH బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో 286 పరుగులు చేసిన టీమ్.. ఆ తర్వాత మ్యాచుల్లో కూడా అదే రీతిలో ఆడుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ సన్ రైజర్స్ బ్యాటర్లు తుస్సుమనిపించారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న కోల్ కత్తా ప్రస్తుతం ఒత్తిడిలో కనిపిస్తోంది. అయినా కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. కానీ సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగితే… బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్ అందుకుంటే కోల్ కత్తాను ఓడించడం పెద్ద కష్టం కాదు.