ఒక్క మ్యాచ్ తోనే తుస్, హోంగ్రౌండ్ లో సన్ రైజర్స్ ఫ్లాప్ షో
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడయంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే..

సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడయంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే.. ఈసారి లక్నో బౌలర్లు ఆరెంజ్ ఆర్మీని చావు దెబ్బకొట్టారు. 300 స్కోర్ అంటూ మ్యాచ్‌కి ముందు ఫ్యాన్స్ హడావుడి చేయడంతో సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. లక్నో బ్యాటర్లు వచ్చినోడు వచ్చినట్టు బౌండరీలు మోత మోగించడంతో భారీ టార్గెట్‌ను మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ను ముగించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై ఇదే స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 286 పరుగులు చేసినా పంత్ బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడని అడిగితే, సన్‌రైజర్స్ ఎంత స్కోర్ చేసినా బీట్ చేస్తామంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. చెప్పినట్టే ఓవర్లు మిగిల్చి మరీ ఛేజ్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ మినహా మిగతా ఎవరూ రాణించలేదు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 16.1 ఓవర్లలోనే 193 పరుగులు చేసి చెప్పినట్టే మ్యాచ్‌ని గెలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్‌లు ఆడలేకపోయారు. క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తక్కువస్కోరుకే పరిమితమయ్యారు. మధ్యలో నితీశ్ రెడ్డి, అనికిత్ వర్మ, క్లాసెన్ దూకుడుగా ఆడడంతో మంచి స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివర్లో లక్నో బౌలర్లు పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి.. పరుగులు కట్టడి చేశారు. లక్నో బౌలర్ల దెబ్బకు సన్‌రైజర్స్ చివరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. దీంతో హైదరాబాద్ స్కోరు 200 పరుగుల మార్కును దాటలేకపోయింది.
ఛేజింగ్ లో షమీ తీసిన మొదటి వికెట్ తప్పిస్తే సన్‌రైజర్స్ ఫ్యాన్స్ వావ్ అనిపించే ఒక్క మూమెంట్ కూడా జరగలేదు. ఎందుకంటే నికోలస్ పూరన్, క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బ్యాట్‌తో ఒకటే బాదుడు బాదేశాడు. భారీ సిక్సర్లతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ దగ్గరికే బంతిని పంపాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అభిమానుల కేరింతల తప్ప సన్‌రైజర్స్ ఆనందపడిన సందర్భాలు ఏమీ లేవు . మరోవైపు న్‌రైజర్స్ ఓడిపోతుంటే కావ్య పాప ఎంతలా అసహనానికి గురవుతుందో క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్ ఓడిందంటే ముందుగా సోషల్ మీడియాలో కనిపించేవి కావ్య మారన్ ఫొటోలే. దానికి తోడు ఆరెంజ్ ఆర్మీ టార్గెట్‌ను ఇంకొందరు మీమ్స్‌తో సన్‌రైజర్స్‌ను ఆడుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ ఫొటోలు నెట్టింట పోస్ట్ చేసి ట్రోలింగ్‌కు చేస్తున్నారు.