సన్ రైజర్స్ కు కొత్త తలనొప్పి ఇషాన్ ఆడేది ఎక్కడ ?
ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. గత ఏడాది రన్నరప్ తో సరిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.

ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. గత ఏడాది రన్నరప్ తో సరిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. దానికి తగ్గట్టుగానే జట్టులో కీలక మార్పులు చేసింది. నిలకడగా రాణించిన ఐదుగురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుంది. ఇప్పుడు తుది జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ను ఆడించడంపై తర్జన భర్జన పడుతోంది. మెగా వేలంలో ఈ యువ ఓపెనర్ ను సన్ రైజర్స్ 11.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే తుది జట్టులో అతన్ని ఎక్కడ బ్యాటింగ్ దింపాలనే దానిపై తలపట్టుకుంటోంది.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇషాన్ ఓపెనర్‌గానే రాణించాడు. ఒకవేళ అతడిని ఓపెనర్‌గానే పంపాలని భావిస్తే హెడ్‌కు జోడిగా పంపిచొచ్చు. అప్పడు అభిషేక్ శర్మ వన్‌డౌన్‌లో ఆడాల్సి ఉంటుంది. గత సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా చక్కగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 22 సగటుతో 320 పరుగులు చేశాడు. ముంబై తరుపున 84 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ ఎక్కువగా ఓపెనర్‌గానే వచ్చాడు. 49 సందర్భాల్లో ఓపెనర్‌గా వచ్చిన అతడు 33 సగటుతో 1514 పరుగులు చేశాడు. దీనిలో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం సన్ రైజర్స్ ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను మార్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ జోడీ గత సీజన్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. దీంతో ఈ సీజన్‌లో ఈ జోడీని మార్చే అవకాశాలు దాదాపుగా లేవు.
ఒకవేళ ఓపెనింగ్ జోడిని మార్చొద్దని భావిస్తే.. అప్పుడు ఇషాన్‌ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 11 సందర్భాల్లో మూడో ప్లేస్ లో వచ్చాడు. అయితే.. ఈ ప్లేస్ లో ఇషాన్ పెద్దగా రాణించలేదు. 19 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగో స్థానంలో 22 సగటుతో 583 పరుగులు చేశాడు. ఐదు, ఆరో స్థానాల్లో ఒక్కొ సారి బ్యాటింగ్ చేసిన ఇషాన్ అక్కడ కూడా పెద్దగా రాణించలేదు. ఇషాన్ ను ఓపెనర్ గా కాకుండా మిగిలిన ఏ స్థానంలో ఆడించినా కూడా జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ ను ఎలా వాడుకుంటుందో తెలియాలంటే మరో వారం వేచిచూడాల్సిందే. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ షురూ కానుండగా…సన్ రజర్స్ తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతోంది.