Suraj Randiv: బస్సు డ్రైవర్ గా చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్
క్రికెట్‌లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన లేదా వహిస్తున్న ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నేళ్లయినా లెక్కలేనంత డబ్బు, మంచి హోదా ఉంటుంది. భారత టీ20 లీగ్ కారణంగా దేశవాళీ క్రికెటర్స్ కూడా బోలెడంత డబ్బు వెనకేసుకున్నారు. చాలా మంది ప్రస్తుతం రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే అన్ని దేశ క్రికెటర్ల పరిస్థితి మాత్రం ఇలా అస్సలు ఉండదు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ ఆడినా.. కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితేనే శ్రీలంక క్రికెటర్ సూరజ్ రణ్‌దివ్ ఎదుర్కొంటున్నాడు.
2009లో శ్రీలంక జాతీయ జట్టులోకి సూరజ్ రణ్‌దివ్ అరంగేట్రం చేశాడు. కొంతకాలం లంక జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అయితే ఏడేళ్లకే తన కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. 2011 ప్రపంచకప్‌లో పాల్గొన్న లంక జట్టులో సభ్యుడు. మెగా టోర్నీలో టీమిండియాపై 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 రన్స్ ఇచ్చాడు. అయితే జాతీయ జట్టులో తనకంటూ ప్రత్యేకతను చాటుకొన్న సూరజ్‌కు.. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటు దక్కింది. 2011 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్స్ తీశాడు. ఇక ఆ తర్వాతి సీజన్ నుంచి ఐపీఎల్‌లో కనిపించలేదు.
సూరజ్ రణ్‌దివ్ శ్రీలంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 85 వికెట్లు పడగొట్టాడు. ఆకాశం ఎత్తుకు ఎదిగిన సూరజ్ ఒక్క ఉదుటన కిందికి పడిపోయాడు. సూరజ్ జీవితంలో ఏమైందో తెలియదు కానీ.. కుటుంబ పోషణ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో హేమాహేమీలతో ఆడిన అతడు ఇప్పుడు ఓ బస్సు డ్రైవర్. రిటైర్మెంట్ అనంతరం ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సూరజ్.. మెల్‌బోర్న్ సిటీలో బస్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ట్రాన్స్ వేడ్ అనే కంపెనీలో బస్ డ్రైవర్‌గా ఉన్నాడు. సూరజ్ రణ్‌దివ్ ఓ వైపు డ్రైవర్‌గా పని చేస్తూనే మరోవైపు క్రికెట్ ఆడుతున్నాడు.
ఓ క్లబ్‌కు రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతున్నాడు. ఇక 2023 ఆరంభంలో భారత గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. శ్రీలంక మాజీ ప్లేయర్ చితక జయసింఘే, జింబాంబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ మెంగ్వా కూడా సూరజ్ పనిచేస్తున్న కంపెనీలోని డ్రైవర్‌లుగా పనిచేస్తున్నారు. ఎంఎస్ ధోనీతో ఆడినా.. ప్రపంచకప్ జట్టులో సభ్యుడు అయినా శ్రీలంక ఆటగాడి పరిస్థితి ఇలా మారింది. సూరజ్ జీవితం ప్రతి క్రికెటర్‌కు ఓ గుణపాఠం లాంటిదే.