Virat Kohili: విరాట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంపైర్లుగా
భారత క్రికెట్‌లోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేష్ అర్గల్ రిటైర్మెంట్ చేసిన చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు అంపైర్లు కాబోతున్నారు. తన్మయ్, అజితేష్ బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఇప్పుడు వారిద్దరూ అంపైర్లు కాబోతున్నారు. అజితేష్, తన్మయ్‌ల ప్రత్యేకత ఏంటంటే.. వీరిద్దరూ 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్ ఆడారు. అలాగే ఛాంపియన్ టీమ్‌లో కూడా ఉన్నారు. 33 ఏళ్ల ఓపెనర్ బ్యాట్స్‌మెన్ తన్మయ్ శ్రీవాస్తవ, 34 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అజితేష్ అర్గల్ సుమారు 3-4 సంవత్సరాల క్రితం క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. గత నెలలో వీరిద్దరూ అహ్మదాబాద్‌లో జరిగిన అంపైరింగ్ పరీక్షకు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితం జులై 26న వచ్చింది. ఇద్దరూ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అతి త్వరలో వీరిద్దరూ భారత్‌లో జరిగే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో అఫీషియల్‌గా వ్యవహరించే అవకాశం లభించనుంది. అంపైర్ కాబోతున్న తన్మయ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, బీసీసీఐ అంపైరింగ్ ప్యానెల్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందని తన్మయ్ ప్రకటించాడు.
నేను క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను. అంపైరింగ్ ద్వారా అలా చేయడం నాకు మంచిది. ఇది నాకు కొత్త పాత్రకు నాంది. నేను కోచింగ్‌లో బాగానే ఉన్నాను. కానీ, మరింత ముందుకు వెళ్లాలనుకున్నాను. అంపైరింగ్ ఎంపిక మంచిదని నేను భావించాను. త్వరలో ఐసీసీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తన్మయ్ శ్రీవాస్తవ, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు. తన్మయ్ ఆరు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 52.40 సగటుతో 262 పరుగులు చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో అతను 46 పరుగుల ఇన్నింగ్స్‌ను సాధించాడు. తన్మయ్ 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 34.39 సగటుతో 4918 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతనికి 10 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏలో అతనికి 7 సెంచరీలు కూడా ఉన్నాయి.
అజితేష్ అర్గల్ 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 31.29 సగటుతో 24 వికెట్లు తీశాడు. 2008 అండర్-19 ప్రపంచకప్‌లో అజితేష్ బాగా బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్ ఫైనల్‌లో తన బౌలింగ్‌తో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో 5 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్ తర్వాత అజితేష్, తన్మయ్ పూర్తిగా కనుమరుగయ్యారు.