Team India: పదేళ్లుగా టీమిండియాకు దక్కని ఐసీసీ ట్రోఫీ.. మనవాళ్లు మారరా..?
చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం గెలుచుకుంది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్.. దానికి ముందు టీ20 వరల్డ్ కప్ మాత్రం ఇండియాకు దక్కాయి. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీల్లో వరుసగా ఓడిపోతూనే ఉంది.
Team India: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన జట్లలో టీమిండియా ఒకటి. అయితే, దశాబ్ద కాలంగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలుచుకోలేదు. చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం గెలుచుకుంది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్.. దానికి ముందు టీ20 వరల్డ్ కప్ మాత్రం ఇండియాకు దక్కాయి. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీల్లో వరుసగా ఓడిపోతూనే ఉంది. 2013 తర్వాత జరిగిన నాలుగు 20 వరల్డ్ కప్స్, రెండు వన్డే వరల్డ్ కప్స్ పోటీల్లోనూ భారత్ చతికిలపడింది. స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ఇతర టోర్నీల్లో బాగానే ఆడే టీమిండియా.. ఐసీసీ టోర్నీలు అంటే మాత్రం ఎందుకో వెనుకబడిపోతోంది. తాజాగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా ఈ మ్యాచుల్లో ఓడిపోవడం ఇది రెండోసారి. రెండుసార్లు ఫైనల్‌లో అడుగుపెట్టినా ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. ఈ పరిస్థితుల్లో మన జట్లు సామర్థ్యంపై విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు? నిజంగా మనవాళ్లకు ఐసీసీ టోర్నీ గెలిచే సత్తాలేదా..?
టెస్టుల్లో భారత్ నిలకడగా ఆడుతుంది. గత ఏడాది కాలంగా మంచి విజయాలు నమోదు చేసింది. దీంతో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకుంది. కానీ, ఫైనల్‌లో వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. మొదటిసారి న్యూజిలాండ్ చేతిలో.. రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో. అంతకుముందు జరిగిన టెస్టు మ్యాచుల్లో మంచి ఫామ్ కనబర్చిన మన ఆటగాళ్లు ఫైనల్‌లో మాత్రం తేలిపోతున్నారు. స్టార్ ప్లేయర్లు సైతం సరిగ్గా మెప్పించలేకపోతున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై మనవాళ్లు రెచ్చిపోతారని.. కానీ, పరాయిగడ్డపై మాత్రం చేతులెత్తేస్తారని విమర్శ ఉంది. ఇండియాలోని పిచ్‌లను మనకు అనుకూలంగా తయారు చేసుకుని విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లేసరికి అక్కడి పేస్ పిచ్‌లను తట్టుకోలేక చతికిలపడతారు. నిజానికి మనవాళ్లు ఇతర టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా ఇండియాలో జరిగే టోర్నీల్లో పై చేయి సాధిస్తారు. విదేశాల్లోనూ వన్డే టోర్నీల్లో విజయం సాధిస్తారు. కానీ, ఐసీసీ టోర్నీలలో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనిపించడం లేదు.
బౌలింగ్.. బ్యాటింగ్‌లో విఫలం
తాజా మ్యాచులో అటు బౌలర్లు.. ఇటు బ్యాటర్లు విఫలమయ్యారు. గతంలో బుమ్రా ఉన్నప్పుడు మన బౌలర్లు విదేశాల్లోనూ అద్భుతంగా రాణించేవాళ్లు. బుమ్రా, షమీ బౌలింగులో అదరగొట్టేవాళ్లు. కానీ, గాయం కారణంగా బుమ్రా దూరం కావడం నష్టం కలిగిస్తోంది. ఈ మ్యాచుల్లో షమీ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. సిరాజ్ మాత్రం నిలకడగా బౌలింగ్ చేశాడు. బుమ్రా స్థానంలో వచ్చిన ఉమేష్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బౌలర్లలో సరైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈసారి బ్యాటింగ్‌లోనూ సరైన ప్రదర్శన కనిపించలేదు. పుజారా, శుభ్‌మన్ గిల్ ఆకట్టుకోలేకపోయాడు. రహానే ఒక్కడే నిలకడైన ప్రదర్శన చేశాడు. రోహిత్, కోహ్లీ కూడా గతంలోలాగా జట్టును నడిపించలేపోయారు.
ఐపీఎల్ కూడా కారణమేనా?
ఈ సారి ఇండియాలో ఐపీఎల్ ఘనంగా జరిగింది. ఈ టోర్నీ ముగియగానే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. దీంతో రెండు టోర్నీల మధ్య ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించలేదు. టోర్నీకి సిద్ధమయ్యే అవకాశం కూడా దొరకలేదు. ఇది కూడా మనజట్టు ఓటమికి ఒక కారణం అయ్యుండొచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ మన జట్టు ఓటమిని అంగీకరించలేం. ఏ పరిస్థితుల్లో అయినా జట్టు విజయమే ప్రధాన లక్ష్యం. కలిసికట్టుగా ఆడి టీమిండియాను గెలిపించడమే ఆటగాళ్లు చేయాల్సిన పని. కానీ, ఈ విషయంలో మన ఆటగాళ్లకు అంత శక్తి లేదని తాజా మ్యాచ్ రుజువు చేసింది.
టోర్నీ వేదిక మారిస్తే
వరుసగా రెండుసార్లు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఇంగ్లండ్ (లండన్)లో నిర్వహించడాన్ని బీసీసీఐ తప్పుబడుతోంది. తాజా మ్యాచుతోపాటు, గత ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇండియాపై ఆ రెండు జట్లు వరుసగా విజయం సాధించాయి. మనవాళ్లు ఇక్కడి వాతావరణం, పిచ్‌కు అలవాటు పడే సమయం కూడా చిక్కడం లేదు. దీంతో ఇతర ఆటగాళ్లలా మనవాళ్లు రాణించలేకపోతున్నారు. ఫైనల్ మ్యాచును జూన్‌లో నిర్వహించడం కూడా సమస్యగా మారింది. అప్పటికే భారత ఆటగాళ్లు రెండు నెలలు ఐపీఎల్ ఆడుతారు. ఆ వెంటనే అంతర్జాతీయ టోర్నీ అనేసరికి ఒత్తిడికి లోనవుతారు. అందువల్ల ఈ తేదీని మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. భారీ సిరీస్‌లో పాల్గొన్న తర్వాత ఐసీసీ టెస్ట్ ఫైనల్‌లో పాల్గొనడం వల్ల జట్టు ఒత్తిడికి గురవుతోందని బీసీసీఐ అభిప్రాయం. అలాగే రెండేళ్లపాటు టెస్టు సిరీస్‌లు నిర్వహించి.. ఫైనల్‌ను ఒకే మ్యాచుతో ముగించేయడం కూడా సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని కూడా సిరీస్‌గా నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయం కలుగుతోంది. కనీసం మూడు మ్యాచులు నిర్వహించాలని క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.