Teja Nidamanuru: వెస్టిండీస్‌పై అదరగొట్టిన తెలుగోడు.. నెదర్లాండ్స్ తరఫున విధ్వంసకర సెంచరీ నమోదు..
క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న నెదర్లాండ్స్ తాజాగా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దీంతో విండీస్‌పై నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది తెలుగువాడైన తేజ నిడమానూరు.
Teja Nidamanuru: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఒకప్పుడు క్రికెట్ దిగ్గజాలకు పెట్టిందిపేరైన వెస్టిండీస్‌ను చిన్న జట్లు ఆడుకుంటున్నాయి. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న నెదర్లాండ్స్ తాజాగా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దీంతో విండీస్‌పై నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది తెలుగువాడైన తేజ నిడమానూరు.
ఆంధ్ర (విజయవాడ)కు చెందిన ఈ ఆటగాడు నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 76 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. విండీస్ విజయంలో తేజ నిడమానూరుదే ప్రధాన పాత్ర. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోరు సాధించింది. 374 పరుగులు చేసింది. అందరూ ఇక విండీస్‌దే విజయం అనుకున్నారు. పసికూనలాంటి నెదర్లాండ్స్ విజయం సాధించడం కష్టమే అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నెదర్లాండ్స్ విజయం సాధించింది. తేజ అద్భుత శతకంతో భరీ స్కోరును సమం చేసింది. రెండు జట్ల స్కోర్లూ 374 కావడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడించారు.
ఈ ఓవర్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ అద్భుతంగా ఆడాడు. వరుసగా 4,6,4,6,6,4తో వరుసగా బంతిని బౌండరీ దాటించాడు. తర్వాత 31 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విండీస్ చేతులెత్తేసింది. దీంతో నెదర్లాండ్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలుసిసలైన క్రికెట్ మజాను చూపించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తేజకు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అండగా నిలిచాడు. స్కాట్ 47 బంతుల్లో 67 ఫోర్లు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు విండీస్ బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ అదరగొట్టాడు. 65బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
పూరన్‌తోపాటు బ్రాండన్ కింగ్ 76 పరుగులు, జాన్సన్ ఛార్లెస్ 54 పరుగులు సాధించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 374 పరుగులు చేయగలిగింది. అయితే సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. గతంలో క్రికెట్ ప్రపంచ కప్‌లు నెగ్గిన విండీస్ ఇప్పుడు క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సి వస్తోంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచులో కూడా ఘోరపరాజయం పొందింది. తాజా మ్యాచులో తేజ సాధించింది అతడి రెండో ఇంటర్నేషనల్ వన్డే సెంచరీ.