ఆర్సీబీకి టెన్షన్ టెన్షన్ ఐపీఎల్ కు హ్యాజిల్ వుడ్ డౌటే
ఐపీఎల్ 18వ సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ఇప్పటికే ప్రిపరేషన్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి.

ఐపీఎల్ 18వ సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ఇప్పటికే ప్రిపరేషన్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. వచ్చే వారం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. మార్చి చివరివారంలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. దీని కోసం ఫ్రాంచైజీలు తమ జట్లను సిద్ధం చేస్తున్నాయి. అంతర్జాతీయ టోర్నీలలో ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా జట్ల ఓనర్లు ఓ కన్నేసి ఉంచారు. కొందరు రాణిస్తుండగా మరికొందరు బ్యాడ్ ఫామ్ తో టెన్షన్ పెడుతున్నారు. అదే సమయంలో గాయాల బెడద కూడా వెంటాడుతోంది. 17 సీజన్లు గడిచినా.. ఒక్క టైటిల్ నోచుకోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతిసారి హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది.
కానీ టైటిల్ గెలవాలన్న కల నెరవేరడం లేదు. గడిచిన సీజన్లో అద్భుతంగా రాణించి టైటిల్ వేటలో పోటీ పడింది. కానీ అదృష్టం కలిసి రాక చివర్లో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మళ్ళీ టైటిల్ విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ కొందరు ఆటగాళ్ళ గాయాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఆర్సీబీకి తలనొప్పిగా మారాడు. మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని 12.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి ముందు కూడా అతను ఐపీఎల్‌లో ఆర్‌సిబి తరపున ఆడాడు.
అయితే వచ్చే సీజన్లో హాజిల్‌వుడ్ ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. అప్పటి నుంచీ ఆటకు దూరమైన ఈ పేసర్ పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా అనేది తెలియడం లేదు. ఐపీఎల్ కు ఇంకా నెలరోజుల పైనే టైమ్ ఉన్నప్పటకీ.. ఈ లోపు హ్యాజిల్ వుడ్ కోలుకుంటాడా అనేది చూడాలి. జోష్ హాజిల్‌వుడ్ 2020 నుండి 2023 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా గాయపడ్డాడు. అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను కంగారు పెడుతోంది.