పస లేని పాకిస్తాన్ ఇదేం జట్టు అంటున్న మాజీలు

మా జట్టుకు అంత సీన్ లేదు... ఒక మ్యాచ్ గెలిస్తే గొప్ప...మా వాళ్ళు జింబాబ్వేతో సిరీస్ లు ఆడుకోవడం బెటర్... ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అర్హత కూడా లేదు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 07:30 PMLast Updated on: Feb 25, 2025 | 7:30 PM

The Former Say That This Is The Team Of Pakistan Waste

మా జట్టుకు అంత సీన్ లేదు… ఒక మ్యాచ్ గెలిస్తే గొప్ప…మా వాళ్ళు జింబాబ్వేతో సిరీస్ లు ఆడుకోవడం బెటర్… ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అర్హత కూడా లేదు… ఈ మాటలు పాకిస్తాన్ గురించి… అన్నది ఎవరో కాదు ఆ దేశ మాజీ ఆటగాళ్ళే… ఈ కామెంట్స్ ను చూస్తే చాలు పాక్ జట్టు ఎంత పేలవంగా ఆడుతుందో చెప్పడానికి… నిజమే పాక్ జట్టు అనిశ్చితికి మారు పేరు.. ఎప్పుడెలా ఆడుతుందో తెలీదు… ఒక్కోసారి 350 పైగా స్కోర్ ఛేజ్ చేస్తారు.. మరోసారి 120 కూడా కొట్టలేరు.. అందుకే పాక్ జట్టుపై వారి దేశంలోనే నమ్మకం ఉండదు… ఇక భారత్ తో మ్యాచ్ అంటే పాక్ క్రికెటర్లు ప్రాణం పెట్టి చివరి వరకూ పోరాడతారన్న నమ్మకం గతంలో ఉండేది… వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామూల్ హక్ వంటి దిగ్గజ ఆటగాళ్ళు ఆడిన సమయంలో పాక్ జట్టు భారత్ ను ఓడించిన సందర్భాలున్నాయి… భారత్ పై చివరి బంతి వరకూ పోరాడిన సందర్భాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టీమిండియాపై ఓడినా , గెలిచినా పాక్ పోరాటం గట్టిగానే ఉండేది.

అందుకే ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా అప్పట్లో ఉత్కంఠభరితంగా చివరి బంతి వరకూ టెన్షన్ వాతావరణం ఉండేది. కానీ గత కొన్నేళ్ళుగా భారత్ తో మ్యాచ్ అంటే పాక్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. 2011 ప్రపంచకప్ తర్వాత మనం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పాక్ తో తలపడుతున్నా.. ఒక రేంజ్ పోటీ అయితే ఉండడం లేదు. దీనికి భారత జట్టు బలంగా ఉండడం ఒక కారణమైతే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు అంతకంతకూ దిగజారిపోవడం మరో కారణం. అప్పట్లో మ్యాచ్ ను ఒంటిచేత్తో మలుపుతిప్పే బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మచ్చుకు ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్స్ కనిపించడం లేదు. నాలుగైదు నెలలకోసారి కోచ్ ను మార్చడం, కెప్టెన్ ను మార్చడం కామన్ గా మారిపోయింది. ఆ మధ్య సొంతగడ్డపై సైతం సిరీస్ లు కోల్పోయి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇంత చెత్త జట్టును తానెప్పుడూ చూడలేదంటూ భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ చేసిన కామెంట్స్ తో చాలామంది ఏకీభవిస్తున్నారు.

నిజమే క్రికెట్ లో విజయాలు ఏ జట్టుకు ఒకే ఒక్క ప్లేయర్ వల్ల రావు… సమిష్టిగా రాణిస్తేనే గెలుపు దక్కుతుంది. మ్యాచ్ విన్నర్లు లేకుండా ఐసీసీ టోర్నీలు గెలవడం అసాధ్యం. కనీసం రిజర్వ్ బెంచ్ లో కూడా సరైన ఆటగాళ్ళు లేరని పలువురు పాక్ మాజీలు చెబుతున్నారు. ఈ మెగా టోర్నీలోని మొద‌టి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక భార‌త్‌తో జ‌రిగే మ్యాచ్‌లో సైతం పాక్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. చెత్త ప్రదర్శనతో పాక్ ఇప్పుడు టోర్నీ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో స్వదేశంలో అభిమానులు, మాజీల విమర్శలు ఎలా తట్టుకుంటుందో చూడాలి.