రాసిపెట్టుకోండి పాక్ కు దబిడి దిబిడే
వరల్డ్ క్రికెట్ లో హైవోల్టేజ్ క్లాష్ అంటే గుర్తొచ్చేది భారత్, పాకిస్తానే జట్లే... చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ పోరు ఎప్పుడు జరిగిన దానికుండే క్రేజే వేరు...

వరల్డ్ క్రికెట్ లో హైవోల్టేజ్ క్లాష్ అంటే గుర్తొచ్చేది భారత్, పాకిస్తానే జట్లే… చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ పోరు ఎప్పుడు జరిగిన దానికుండే క్రేజే వేరు… ప్రధానిమంత్రి నుంచి సగటు అభిమాని వరకూ అందరికీ ఈ మ్యాచ్ పైనే ఆసక్తి… రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. ఇప్పుడు మరోసారి దాయాదుల క్రికెట్ సమరం జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్ , పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ పై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. పలువురు మాజీ క్రికెటర్లు రెండు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎవరు ఫేవరెట్ అనేది అంచనా వేశాడు. ఏ విధంగా చూసినా ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ అన్నాడు. ప్రస్తుత ఫామ్, జట్ల బలాబలాల పరంగా పాకిస్తాన్ పై భారత్ గెలుస్తుందన్నాడు.
టీమిండియా తన అన్ని మ్యాచ్ లనూ దుబాయ్ లోనే ఆడనుండడం అడ్వాంటేజ్ గా చెప్పుకొచ్చాడు. అక్కడి పిచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వస్తుందన్నాడు. ఇరు జట్లలో దుబాయ్ పిచ్ భారత్ కే కలిసొస్తుందని విశ్లేషించాడు. పాక్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదని, కానీ సీనియర్లు, యువ ఆటగాళ్ళతో బలంగా ఉన్న ఇండియాను ఓడించడం ఈ సారి పాక్ జట్టుకు కష్టమేనని భజ్జీ తేల్చేశాడు. ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీతో ఫామ్ అందుకున్నాడని, ఇక కోహ్లీ కూడా చెలరేగితే పాక్ కు చుక్కలు కనిపించడం ఖాయమని చెప్పుకొచ్చాడు. వన్డే ఫార్మాట్ లో గత రికార్డులు కూడా భారత్ కే అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు ఎప్పటిలానే భీభత్సమైన క్రేజ్ నెలకొంది. టికెట్లు ఆన్ లైన్ పెట్టిన కొన్ని నిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సాధారణ స్టాండ్ టికెట్ల ప్రారంభ ధర భారత కరెన్సీ ప్రకారం సుమారు 2,965గా నిర్ణయించారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం పూర్తిస్థాయి సామర్థ్యం 25,000గా ఉంది. అయితే భారత్-పాక్ మ్యాచ్ టికెట్ల కోసం సుమారు 1,50,000 మంది ఒకేసారి ఆన్‌లైన్ ప్రయత్నించారని తెలుస్తోంది. అందులో ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే టికెట్ దక్కినట్లయింది. గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుండగా..వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 8లో ఉన్న జట్లు అర్హత సాధించాయి.