ఇదేం కొట్టుడు సామీ సచిన్ వయసు తగ్గుతోందా ?
క్రికెట్ లో 37-38 ఏళ్ళ వయసులోకి వచ్చారంటే రిటైర్మెంట్ టైమ్ వచ్చినట్టే... ఈ వయసు తర్వాత ఆటలో కొనసాగడం కాస్త కష్టమే... ఎందుకంటే ఫిట్ నెస్ సాధించడంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి..

క్రికెట్ లో 37-38 ఏళ్ళ వయసులోకి వచ్చారంటే రిటైర్మెంట్ టైమ్ వచ్చినట్టే… ఈ వయసు తర్వాత ఆటలో కొనసాగడం కాస్త కష్టమే… ఎందుకంటే ఫిట్ నెస్ సాధించడంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి.. కానీ కొందరు క్రికెటర్లు మాత్రమే 40 ఏళ్ళ వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగారు.. భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇప్పటికీ ఫ్యాన్స్ కు బాధ కలిగించేదే… కానీ రిటైర్మెంట్ తర్వాత కూడా సచిన్ తనదైన బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. 52 ఏళ్ళ వయసులోనూ మునుపటి సచిన్ ను అభిమానులకు చూపిస్తున్నాడు. తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భారత క్రికెట్ దిగ్గజం దుమ్మురేపుతున్నాడు.
ఫోర్లు, సిక్సర్లతో ఇదేం బాదుడు సామీ అన్నట్లు ఆడుతున్నాడు. అవతల ఎలాంటి బౌలర్ అయినా అస్సలు తగ్గడం లేదు. స్టేడియంలో ఊచకోత కోస్తున్నాడు. తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి ఆసీస్ పై రెచ్చిపోయాడు. ధనాధన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సచిన్.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 33 బంతుల్లో 64 రన్స్ స్కోరు చేశాడు.
ఇలా 194 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఒక్క సచిన్ తప్ప మరెవరూ పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ నిర్ధేశించిన 269 పరుగులను ఛేధించలేక 174 పరుగులకే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 269 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెన్ డంక్ 53 బంతుల్ 132 పరుగులు చేశాడు. 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా మాస్టర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. 95 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇండియా మాస్టర్స్ నాలుగు మ్యాచులు ఆడింది.. అందులో ఈ మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసింది. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. మొత్తం మీద ఈ ఇన్నింగ్స్ ద్వారా సచిన్ మళ్లీ పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చాడు. ఐదు పదుల వయసులోనూ ఎంత ఫిట్‌గా ఉన్నాడో చూపించాడు.