మళ్ళీ రఫ్ఫాడించేశారు విండీస్ పై సిరీస్ మనదే

సొంతగడ్డపై భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ ను గెలిచిన భారత్ తాజాగా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మరోసారి మన మహిళా బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన వేళ కరేబియన్ టీమ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 07:52 PMLast Updated on: Dec 25, 2024 | 7:52 PM

The Indian Womens Teams Triumphant March On Home Soil Continues

సొంతగడ్డపై భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ ను గెలిచిన భారత్ తాజాగా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మరోసారి మన మహిళా బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన వేళ కరేబియన్ టీమ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో మన వుమెన్ టీమ్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే… విండీస్ బౌలర్లను మన బ్యాటర్లందరూ ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు స్మృతి మంధానా, ప్రతీకా రావల్ హాఫ్ సెంచరీలు చేశారు. మంధాన తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసి ఔటైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్ సెంచరీతో దుమ్మురేపింది. కేవలం 103 బంతుల్లోనే 16 ఫోర్లతో 115 రన్స్ చేసింది. అటు ప్రతీకా 86 బంతుల్లో 76 రన్స్ చేయగా.. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ రెచ్చిపోయింది. మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 రన్స్ చేసింది. జెమీమా 36 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 52 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో కరేబియన్ టీమ్ ఆరంభం నుంచే చేతులెత్తేసింది. 359 రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టులో ఓపెనర్ హేలీ మాథ్యూస్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆమె 109 బంతుల్లోనే 13 ఫోర్లతో 106 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో షిమైన్ క్యాంప్‌బెల్ 38 రన్స్ చేయగా.. మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకే చేతులెత్తేసింది. ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఈ ఇద్దరూ రాణించడంతో విండీస్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, టైటస్ సాధు, ప్రతీకా రావల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. సిరీస్ లో చివరి వన్డే ఇదే వేదికలో శుక్రవారం జరుగుతుంది.