న్యూజిలాండ్ తో మ్యాచ్ ,కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే…!
వరల్డ్ క్రికెట్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కాలంగా పెద్దగా రాణించని కోహ్లీ ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు.

వరల్డ్ క్రికెట్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కాలంగా పెద్దగా రాణించని కోహ్లీ ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ శతక్కొట్టిన ఈ స్టార్ బ్యాటర్ లో మునుపటి కోహ్లీని చూశారు ఫ్యాన్స్…. అందుకే మెగాటోర్నీ రాబోయే మ్యాచ్ లలోనూ విరాట పర్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు పలు రికార్డులు రన్ మెషీన్ ను ఊరిస్తున్నాయి. పాకిస్థాన్ పై అద్భుత శతకంతో కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆదివారం న్యూజిలాండ్ తో జరగబోయే పోరులో కింగ్ కోహ్లీని మరిన్ని రికార్డులు అందుకోవాలని చూస్తున్నాడు.
36 ఏళ్ల కోహ్లి మరో 85 పరుగులు చేస్తే న్యూజిలాండ్ పై అంతర్జాతీయ క్రికెట్లో 3000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన అయిదో బ్యాటర్ గా నిలుస్తాడు. సచిన్, పాంటింగ్ , కలిస్, రూట్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకూ కివీస్ పై 55 మ్యాచ్ లాడిన కోహ్లి 2915 పరుగులు చేశాడు. అతని సగటు 47.01గా ఉంది. దీనిలో 9 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. చివరగా 2023 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై కోహ్లి 117 పరుగులు చేశాడు.ఆదివారం మ్యాచ్ లో కోహ్లి మరో 105 పరుగులు చేస్తే న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గానూ నిలుస్తాడు. ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. భారత క్రికెట్ గాడ్ టెండూల్కర్ 42 మ్యాచ్ ల్లో 1750 పరుగులు చేయగా… ఓవరాల్ గా చూసుకుంటే పాంటింగ్ 51 మ్యాచ్ ల్లో 1971 రన్స్ తో టాప్ లో ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేందుకు కోహ్లీకి మరో 141 పరుగులు కావాలి. ప్రస్తుతం కింగ్ ఖాతాలో 651 పరుగులున్నాయి. క్రిస్ గేల్ 791 స్థానాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో కోహ్లీనే నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన కోహ్లి.. వన్డేల్లో 51వ శతకాన్ని అందుకున్నాజు. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు కూడా కోహ్లీదే. ఇటీవల వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైల్ స్టోన్ చేరుకున్న ఆటగాడిగానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్, సంగక్కర, కోహ్లి మాత్రమే ఇప్పటివరకూ వన్డేల్లో 14 వేలకు పైగా పరుగులు చేశారు. కాగా ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న భారత్ , న్యూజిలాండ్ తో మ్యాచ్ లో గెలిస్తే గ్రూప్ ఏలో టాపర్ గా నిలుస్తుంది. లీగ్ స్టేజ్ ను టాప్ ప్లేస్ లో ముగించి సెమీఫైనల్ కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవ్వాలని భావిస్తోంది.